శ్రీలంక ముక్కోణపు సిరీస్‌కు గంభీర్ దూరం

శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే టీం ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీం ఇండియా ఓపెనర్ గౌతం గంభీర్ గజ్జల్లో గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఆడే అవకాశం లేకపోవడంతో గంభీర్ తిరిగి స్వదేశానికి రానున్నాడు. శ్రీలంకలో ఇప్పటికే కాంపాక్ కప్ 2009 ముక్కోణపు వన్డే సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

భారత్ ఈ సిరీస్‌‍లో తన తొలి మ్యాచ్ శుక్రవారం న్యూజిలాండ్‌తో ఆడబోతుంది. ఈ నేపథ్యంలో గంభీర్ జట్టుకు దూరమైన అర్ధాంతరంగా స్వదేశానికి పయనమయ్యాడు. ప్రాక్టీసు చేస్తుండగా గాయపడిన గంభీర్‌కు జట్టు ఫిజియో పది రోజుల విశ్రాంతి సూచించాడు. దీంతో గంభీర్ త్వరలోనే స్వదేశానికి తిరిగి రానున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి ఎన్.శ్రీనివాసన్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

గంభీర్ స్వదేశానికి వస్తున్నాడు. అతని స్థానంలో జట్టుకు మరో ఆటగాడిని సెలెక్షన్ కమిటీ త్వరలోనే ఎంపిక చేస్తుందని చెప్పారు. ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ రూపంలో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు టీం ఇండియాకు దూరమైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ గాయాల కారణంగా ముక్కోణపు వన్డే సిరీస్‌కు, అనంతరం జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో లేరు.

తాజాగా ముక్కోణపు సిరీస్‌కు గంభీర్ కూడా దూరమవడంతో టీం ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గంభీర్ ఇంటిముఖం పట్టడంతో జట్టుకు రెగ్యూలర్ ఓపెనర్లు దూరమయ్యారు. గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న మరో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గాయంతో మరికొన్ని వారాలు జాతీయ జట్టుకు దూరంగా ఉండనున్నాడు.

వెబ్దునియా పై చదవండి