షోయబ్ అక్తర్ పిటిషన్‌పై విచారణ వాయిదా

న్యాయపరమైన వివాదాల నుంచి బయటపడేందుకు వివాదాస్పద పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. తనపై పీసీబీ విధించిన రూ.7 మిలియన్ల జరిమానా, 18 నెలల నిషేధాన్ని సవాలు చేస్తూ షోయబ్ అక్తర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నిరవధికంగా వాయిదా పడింది.

లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించడంతో అక్తర్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. అక్తర్ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి ఇంతియాజ్ సిద్ధిఖీ విధుల నుంచి తొలగించబడ్డారు. ఇటీవల పాకిస్థాన్ సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం అప్పటి దేశ అధ్యక్షుడు ముషారఫ్ ఎమర్జెన్సీ విధించడం అక్రమమని తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఆ సమయంలో న్యాయమూర్తుల తొలగింపు, వారి స్థానాల్లో చేపట్టిన నియామకాలు కూడా అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి సిద్ధిఖీ తొలగించబడ్డారు. సిద్ధిఖీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న కేసుల విచారణ కూడా ఈ కారణంగా నిరవధికంగా వాయిదా పడ్డాయి. వీటిలో అక్తర్ పిటిషన్ కూడా ఉంది.

వెబ్దునియా పై చదవండి