సింధ్ మంత్రి వ్యాఖ్యలపై పీసీబీ ఛైర్మన్ అసంతృప్తి

శుక్రవారం, 9 అక్టోబరు 2009 (14:44 IST)
మ్యాచ్ ఫిక్సింగ్‌పై సింధ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ మంత్రి ముహమ్మద్ అలీ షా చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ ఇజాజ్ భట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతాయుత స్థానంలో ఉండే వారు ఇలాంటి తొందరపాటు వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు.

ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్‌కు గురైనట్టు వార్తలు వచ్చాయి. దీనిపై మంత్రి ఆలీ షా మాట్లాడుతూ.. సెమీ ఫైనల్‌కు మైదానం అంపైర్లను భారత్ ప్రలోభాలకు గురి చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా, పాక్‌ కూడా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కావాలనే ఓడిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

దీనిపై ఇజాజ్ భట్ స్పందించారు. టోర్నీలో ఒకటి రెండు నిర్ణయాలు మాకు వ్యతిరేకంగా వచ్చాయి. అయితే దీనిపై మేం ఏం చేయలేం. ఒక వ్యవస్థ ప్రకారం ఐసీసీ పని చేస్తోంది. అన్ని దేశాలకు చెందిన బోర్డు సభ్యులు ఉన్నారు. ఐసీసీ నిబంధనలు పాక్ కూడా ఆమోదించిందని చెప్పారు. అయితే, మైదానం అంపైర్లు తప్పు చేసినట్టు నిర్ధారణకు వస్తే మాత్రం ఐసీసీ స్వయంగా విచారణ జరుపుతుందని గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి