సీనియర్ క్రికెటర్లపై విండీస్ బోర్డు ఉక్కుపాదం

శుక్రవారం, 10 జులై 2009 (11:22 IST)
తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వెస్టిండీస్ క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఉక్కుపాదం మోపింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న టెస్టు, వన్డే సిరీస్‌లకు ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసింది. ఫలితంగా సీనియర్ క్రికెటర్లకు, బోర్డుకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

గత కొంతకాలంగా క్రికెటర్లకు పూర్తిస్థాయి కాంట్రాక్టులు ఇవ్వకుండా బోర్డు నిర్లక్ష్య ధోరణితో వ్యవహిస్తోంది. దీన్ని విండీస్ ఆటగాళ్ల సంఘం ఖండించింది. తక్షణం కాంట్రాక్టులను కేటాయించాలని లేని పక్షంలో స్వదేశంలో జరిగే బంగ్లా సిరీస్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించింది.

అయితే, ఆటగాళ్ళ సంఘం హెచ్చరికలను బేఖాతర్ చేసిన విండీస్ బోర్డు.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించింది. ఇందులో తొమ్మిది మంది ఆటగాళ్లకు తొలిసారి అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశాన్ని కల్పించింది. జట్టు సారథిగా ఫ్లాయిడ్ రీఫెర్, వైస్ కెప్టెన్‌గా డారెన్ సమ్మీలను నియమించింది.

వెబ్దునియా పై చదవండి