స్పాట్ ఫిక్సింగ్: పాక్ త్రయం సెంట్రల్ కాంట్రాక్టు రద్దు!

FILE
ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణానికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెటర్లు సల్మాన్ భట్, మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్‌ల కాంట్రాక్టులను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) రద్దు చేసింది. ఐసీసీచే సస్పెన్షన్ వేటుకు గురైన వీరి ముగ్గురి కాంట్రాక్టులను పీసీబీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఐసీసీ తమపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయాల్సిందిగా బట్, అమీర్ చేసుకున్న అప్పీళ్లను ఆదివారం దుబాయ్‌లో ఐసీసీ తిరస్కరించడంతో పాక్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ కేసులో విచారణకు ముందే అప్పీలును ఉపసంహరించుకున్న మూడవ నిందితుడు మహ్మద్ ఆసిఫ్‌ను కూడా ఐసీసీ సస్పెన్షన్‌లోనే ఉంచింది.

‘పాకిస్తాన్ తరపున ఆడే ఆటగాళ్లకు మాత్రమే మేము కాంట్రాక్టులను ఇస్తున్నాం. కనుక వారి (బట్, అమీర్, ఆసిఫ్) కేసులు పరిష్కారమయ్యే వరకూ కాంట్రాక్టుల రూపంలో పాక్ క్రికెట్ బోర్డు నుండి వారు ఎటువంటి ప్రయోజనాలనూ పొందలేరు’ అని పిసిబి న్యాయ సలహాదారు తఫాజుల్ రిజ్వీ స్పష్టం చేశాడు.

కళంకితులపై సస్పెన్షన్లను ఎత్తివేసేందుకు ఐసీసీ నిరాకరించినందున వారి నుండి సెంట్రల్ కాంట్రాక్టులను వెనక్కి తీసేసుకుంటున్నట్టు పిసిబి అధికారి జాకీర్ హుస్సేన్ తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి