స్వదేశానికి తిరుగుముఖం పట్టిన కెవిన్ పీటర్సన్!?

FILE
కరేబియన్ గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్‌లో ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అర్థాంతరంగా టోర్నీ నుంచి వైదొలగనున్నాడు. దీనికి కారణం ఏమిటో తెలుసా..? పీటర్సన్ సతీమణి, పాప్‌స్టార్ జెస్సికా తొలి బిడ్డకు జన్మనివ్వనుండటమే..!. ప్రసవం సమయంలో భార్య పక్కనే ఉండాలని పీటర్సన్ భావిస్తున్నాడు.

ఇదే విషయాన్ని పీటర్సన్ స్కై స్పోర్ట్స్‌ ద్వారా ధృవీకరించాడు. స్కై స్పోర్ట్స్‌ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్సన్ మాట్లాడుతూ, తమ కుటుంబంలోకి తొలి శిశువు పుట్టనుండటం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. మరో 24 గంటల్లో తాను ఏ క్షణంలోనైనా ఇంగ్లాండ్ చేరుకుంటానని వెల్లడించాడు.

జెస్సికా ప్రసవం సమయంలో ఆమెకు తోడుగా ఉండాలన్నదే తన అభిప్రాయమని పీటర్సన్ అన్నాడు. ఆమె శిశువుకు జన్మనిచ్చిన వెంటనే తాను మళ్లీ విండీస్‌కు వెళతానని పీటర్సన్ స్పష్టం చేశాడు. తమ జట్టు సెమీస్‌కేగాక, ఫైనల్ కూడా చేరుతుందని ధీమా వ్యక్తం చేశాడు.

ఇదిలా వుంటే, ఒకవేళ పీటర్సన్ స్వదేశానికి వెళ్లి, సకాలంలో తిరిగి రాకపోతే, సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ ఒక సమర్థుడైన ఆటగాడి సేవలను కోల్పోయే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

ఇకపోతే.. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 39 పరుగుల తేడాతో విజయభేరి మోగించగా, పీటర్సన్ 53 పరుగులు చేసి, ఈ విజయంలో కీలక పాత్ర పోషించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి