16 పరుగులు పూర్తి చేస్తే సెహ్వాగ్ చరిత్ర వీరుడే!

శుక్రవారం, 4 డిశెంబరు 2009 (11:18 IST)
భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరో 16 పరుగులు పూర్తి చేస్తే అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకోనున్నాడు. మూడో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా.. ప్రపంచ టెస్టు క్రికెట్‌లో ట్రిబుల్‌ సెంచరీని మూడుసార్లు సాధించిన వీరునిగా చరిత్రలో మిగిలిపోనున్నాడు. ఈ అరుదైన రికార్డును సమకాలీన క్రికెట్ దిగ్గజాలుగా చెప్పుకునే సర్ డాన్ బ్రాడ్‌మెన్‌తో పాటు.. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్‌కు దక్కలేదు.

ఇలాంటి అరుదైన రికార్డు కోసం సెహ్వాగ్ కేవలం 16 పరగులు దూరంలో ఉన్నాడు. ఈ సీరీస్‌లో వరుసగా రెండో టెస్టు సెంచరీని నమోదుచేసుకున్న సెహ్వాగ్‌ గురువారం జరిగే మ్యాచ్‌లో ఈ ఘనతను పూర్తి చేసుకోవాలని కోట్లాది మంది క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

అంతకుముందు.. ముంబైలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో సెహ్వాగ్ టెస్టు మ్యాచ్‌ను వన్డే తరహాలో ఆడిన విషయం తెల్సిందే. సెహ్వాగ్‌ రెచ్చిపోతే అడ్డుకోవడం హేమాహేమీ బౌలర్లకు సాధ్యం కాని నేపథ్యంలో లంక బౌలర్లు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరకు ప్రపంచ మేటి బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌ను కూడా అతడు వదిలి పెట్టలేదు.

కాగా గురువారం జరిగే మూడో రోజు మ్యాచ్‌ ఆట సెహ్వాగ్‌ కెరీర్‌లో చిరస్మరణీయం కానుంది. రికార్డులకోసం వెంపర్లాడే అలవాటు లేని సెహ్వాగ్‌ ఎంతవరకు దీన్ని అందుకుంటాడో చూడాల్సిందే. ఎందుకంటే 199 పరుగుల వద్ద కూడా బంతిని సిక్సర్‌కో లేదంటే బౌండరీకి తరలించాలని ఆరాపటపడే మనస్తత్వం కలిగిన సెహ్వాగ్‌ నిలకడగా ఆడితేనే ఈ అరుదైన ఫీట్‌ను అందుకుంటాడు. లేకపోతే.. తనతో పాటు.. కోట్లాది మంది క్రికెట్ అభిమానులను నిరాశ పరుస్తూ పెవిలియన్‌కు చేరుకుంటాడు.

వెబ్దునియా పై చదవండి