2015 వరల్డ్ కప్ వరకు ధోనీనే కెప్టెన్‌గా ఉండొచ్చు : గంగూలీ

గురువారం, 16 అక్టోబరు 2014 (10:31 IST)
వచ్చే 2015 ప్రపంచ క్రికెట్ కప్ పోటీల వరకు టీమిండియా కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీయే ఉండొచ్చని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ధోనీ కెప్టెన్సీలోనే టీమిండియా వన్డే ప్రపంచ కప్‌ టైటిల్‌ను నిలబెట్టుకునే అవకాశం ఉందన్నారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో ధోనీ స్థానంలో భారత్‌కు మరో ప్రత్యామ్నాయం కన్పించడం లేదని, కాబట్టి 2015 వరల్డ్‌ కప్‌ వరకూ మహీనే కెప్టెన్‌గా కొనసాగించాలని సౌరవ్‌ సూచించాడు. వచ్చే ప్రపంచ కప్‌లో భారత్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుందన్నారు.
 
అయితే, ఈ టోర్నీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ బౌన్సీ ట్రాక్‌లపై జరుగుతుందని, ఇది భారత ఉపఖండపు ఆటగాళ్లకు కఠిన సవాలుతో కూడుకున్న పని అని చెప్పారు. అయితే విదేశాల్లో టెస్టు మ్యాచ్‌లు మాత్రమే భారత్‌కు సమస్య. వన్డే ప్రదర్శనపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 
 
ఇకపోతే.. భారత యువ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. ప్రతి ఒక్క ఆటగాడికి ఏదో ఒక సమయంలో ఇది సహజమే. సాంకేతిక సమస్యను కోహ్లీ త్వరలోనే అధిగమిస్తాడని ఆశిస్తున్నట్టు చెప్పాడు. 

వెబ్దునియా పై చదవండి