ఐపీఎల్ - 3 సంగ్రామం: ఫైనల్ మ్యాచ్ నేడే

ఆదివారం, 25 ఏప్రియల్ 2010 (10:28 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలకు నేటితో తెరపడనున్నాయి. దాదాపు 45 రోజుల పాటు ప్రపంచ క్రికెట్ ప్రజలను రక్తికట్టించిన ఈ పొట్టి క్రికెట్ అంకంలో ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగనుంది. రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ధోనీ నేతృత్వంలోని చెన్నయ్ సూపర్ కింగ్స్, సచిన్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ముంబైలోని డివై.పాటిల్‌ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

అయితే ఫైనల్‌కు ముందే ముంబైకి కోలుకోలేని దెబ్బతగిలింది. అద్భుత ఫాంలో ఉన్న కెప్టెన్‌ సచిన్‌ చేతి వేలి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయారు. టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన విషయం తెల్సిందే. సచిన్‌ ఫైనల్‌కు దూరం కావడం జట్టుకు పెద్ద లోటే. ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే మాస్టర్‌ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదని ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం అభిప్రాయపడింది.

14 మ్యాచ్‌లు ఆడిన సచిన్‌ 47.50 సగటు తో 570 పరుగులు చేశాడు. అతని స్థానంలో వెటరన్‌ ఓపెనర్‌ సనత్‌ జయసూర్య బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో పెద్దగా రాణించని జయసూర్య ఫైనల్ మ్యాచ్‌లో రాణింపుపై సందేహం నెలకొంది.

మొత్తం మీద ముంబై జట్టు బ్యాటింగ్.. బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణిస్తోంది. అలాగే, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు కూడా మంచి జోరు మీద ఉంది. సెమీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డెక్కన్‌ ఛార్జర్స్‌పై సంచలన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్న ధోనీ సేన ట్రోఫీపై కన్నేసింది.

వెబ్దునియా పై చదవండి