ఐపీఎల్ వ్యవహారంలో ఐసీసీ జోక్యం చేసుకోవాలి: మియాందాద్
FILE
కాసుల పంట పండించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవహారాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పర్యవేక్షించాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ డిమాండ్ చేశారు. ఐపీఎల్లో భారీ ఆర్థిక అవకతవకలకు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఐపీఎల్‌పై ఐసీసీ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జావెద్ తెలిపారు.
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీపై తలెత్తిన ఆరోపణలు, సస్పెండ్ వంటి వివాదాలపై తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదని తెలిపిన మియాందాద్.. ప్రైవేట్ సంస్థలు క్రికెటర్ల వద్ద ప్రత్యక్షంగా ఒప్పందం చేసుకోవడాన్ని అనుమతించడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు.
ప్రైవేట్ కంపెనీలు క్రికెటర్ల వద్ద కుదుర్చుకునే ప్రత్యక్ష ఒప్పందాల ద్వారా సమస్యలు తప్పవని మియాందాద్ అన్నారు. ముందు నుంచే ఐపీఎల్ లాంటి భారీ టోర్నమెంట్లలో అవకతవకలు చోటు చేసుకుంటాయని హెచ్చరిస్తూనే ఉన్నానని మియాందాద్ అన్నారు. అందుకే ఐపీఎల్ వ్యవహారాలను ఐసీసీ పర్యవేక్షించాలని సూచించానని మియాందాద్ ఎత్తిచూపారు.
క్రికెటర్ల వద్ద ప్రైవేట్ కంపెనీలు కుదుర్చుకోవడం సరికాదని మియాందాద్ అన్నాడు. దేశం తరపున ఆడితే వచ్చే మొత్తాని కంటే మూడు రెట్లు అదనంగా ఇస్తామని ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తున్నప్పుడు... మోడీ లాంటి వారు భారీ అవకతవకలకు పాల్పడటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. అందుకే ఐపీఎల్ వ్యవహారంలో ఐసీసీ జోక్యం చేసుకోవాలని జావెద్ కోరారు.