ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీని సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో పాల్గొనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లలిత్ మోడీ తెలిపిన నేపథ్యంలో.. మోడీని తప్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంసిద్ధమవుతోంది. ఇంకా లలిత్ మోడీపై సస్పెన్షన్ వేటు వేసేందుకు పాలకమండలి నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
సోమవారం (ఏప్రిల్ 26) జరిగే ఐపీఎల్ పాలకమండలి సమావేశానికి లలిత్ మోడీ హాజరుకాని పక్షంలో ఆయనను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. ఇంకా ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ స్థానంలో రవిశాస్త్రిని నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. రవిశాస్త్రితో పాటు ముగ్గురితో కూడిన బృందం ఐపీఎల్ నిర్వాహ బాధ్యతలను చేపట్టనుందని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. ఐపీఎల్ పాలకమండలి సమావేశాన్ని మే ఒకటో తేదీకి వాయిదా వేయాల్సిందిగా లలిత్ మోడీ కోరారు. ఐపీఎల్ అవకతవకల్లో తనకెలాంటి సంబంధం లేదని, ఈ వ్యవహారంపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు తగిన ఆధారాలతో పాలకమండలి సమావేశానికి హాజరవుతానని మోడీ తెలిపారు. కానీ ముందుగా నిర్ణయించినట్లే ఈ నెల 26వ తేదీన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది.