ఇంగ్లండ్ గడ్డపై ఆడిన నాలుగు టెస్టుల్లో ఘోర పరాజయం పాలై.. ఇంటిముఖం పట్టిన టీమిండియా.. ఇంగ్లీష్మెన్పై ప్రతీకారం తీర్చుకుంటుందా అని అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. సంప్రదాయ టెస్టు ఫార్మాట్లో నెంబర్ వన్ హోదాలో ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా పిచ్‌లను సాకుగా చెప్తూ ఘోరంగా ఓడిపోవడంతో పాటు నెంబర్‌వన్ ర్యాంకునూ ఇంగ్లండ్‌కు సమర్పించుకున్న సంగతి తెలిసిందే.
మరి ఇప్పుడదే ఇంగ్లండ్ నాలుగు టెస్టుల సిరీస్ కోసం భారత్‌లో అడుగుపెట్టింది. మరి.. ఇక్కడి పిచ్‌లు మనకు అనుకూలం, పరిస్థితులు కొట్టినపిండి. మరి భారత్ సొంతగడ్డపై సత్తా చాటుతుందా అనేది వేచి చూడాల్సిందే.
భారత్ స్వదేశంలో ఫేవరెటే అయినా.. ఇటీవలి ప్రదర్శన చూస్తే క్లీన్‌స్వీప్ సంగతేమోగానీ, సిరీస్ గెలిస్తే చాలు అనిపించకమానదు. ఇటీవలే న్యూజిలాండ్‌పై 2-0తో భారత్ వైట్‌వాష్ చేసినా.. పటిష్టమైన లైనప్ ఉన్న ఇంగ్లండ్‌తో మాత్రం అదంత ఈజీకాదు. భారత్‌లో మిగతా జట్ల పరిస్థితెలా ఉన్నా.. ఇంగ్లండ్‌కు మాత్రం కాస్త మెరుగై న రికార్డే ఉంది.
పైగా.. టెస్ట్ సిరీస్‌కు సన్నాహకంగా ఆడిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ మెరుగైన ప్ర దర్శనే చేసింది. తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన బౌలర్లలో ఇంగ్లండ్‌ను ఎదుర్కొనే సత్తా ఉందా అనేది డౌటే. జహీర్, ఇషాంత్, హర్భజన్ వికెట్లు తీయడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. రంజీల్లో ఆడిన ఈ ముగ్గురూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.
ఇక బ్యాటింగ్‌లో సెహ్వాగ్ ఫిట్‌నెస్‌పై సందిగ్దత తొలగిపోలేదు. యువరాజ్ ఫిట్నెస్ కూడా ఐదు రోజుల మ్యాచ్‌కు సరిపోతుందో లేదో చూడాలి. సెహ్వాగ్, గంభీర్ జోడీ ఏడాదికాలంగా పేలవ ఫామ్‌లో ఉంది. కోహ్లీ, సచిన్, యువరాజ్, పుజారాలతో మిడిలార్డర్ బలోపేతంగా కనిపిస్తున్నా.. టెస్టుల్లో కెప్టెన్ ధోనీ ప్రదర్శన ఆందోళనకరంగానే ఉంది.
ఇప్పటికే ఇంగ్లండ్‌తో సిరీస్‌ను ప్రతీకారం కోసం కాకుండా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి టీమిండియా జట్టులో మిగిలిన క్రికెటర్లు ఇంగ్లండ్‌పై రాణించేందుకు ఏమాత్రం కృషి చేస్తారో వేచి చూడాల్సిందే.