ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎన్నో ఆశలతో ఇంగ్లీష్ గడ్డపై అడుగు పెట్టీ పెట్టగానే భారత ఆటగాళ్లలో కొందరు అనారోగ్యం బారిన పడగా, మరికొందరు గాయాల బారిన పడి ఏకంగా సిరీస్‌కే దూరమయ్యారు. తాజాగా ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాను గాయం కారణంగా స్వదేశానికి రానున్నాడు. దీంతో భారత్ ఆడిన మొదటి రెండు టెస్టుల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఒక్క రాహుల్ ద్రావిడ్ మినహా మిగిలిన బ్యాట్స్మెన్లు, బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా.. కాగితంపై పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత జట్టు మైదానంలో అడుగుపెట్టగానే ఒకరి వెనుక ఒకరు క్యూ కడుతూ ఇంగ్లీష్ బౌలర్లకు శ్రమలేకుండా చేస్తున్నారు. ఫలితంగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంతో ఉంది.
ఈ పరిస్థితుల్లో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఇంగ్లండ్‌కు రప్పించారు. 0-2 స్కోరుతో ఇంగ్లండ్ కన్నా వెనుక బడిన భారత్‌ను ఆదుకోగలిగిన 'ఆపద్బాంధవు'డు ఒక్క వీరూనేనంటూ అనేక మంది భావిస్తున్నారు. అయితే, వీరూలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఈప్రశ్నకు ఎక్కువ మంది ఔనని సమాధానమిస్తున్నారు. ఇంగ్లండ్ పేస్‌ను దీటుగా ఎదుర్కొనే మొదటి అడుగును వీరూ సక్రమంగా వేయడంపైనే టీమ్ ఇండియా ఆశలు సజీవంగా నిలిచి ఉంటాయన్నది వీరి అభిమతంగా ఉంది.
ఓపెనర్‌గా బరిలోకి దిగే వీరేంద్ర సెహ్వాగ్.. ఎలాంటి పేసర్నైనా ఏమాత్రం దయాదాక్షిణ్యం లేకుండా చితక బాదుతాడు. ఇప్పుడా ప్రత్యేకత జట్టుకు బాగా అవసరమైంది. తొలి రెండు ఓటములతో నిరాశకు లోనైన భారత ఆటగాళ్లలో నూతనోత్సాహాన్ని నింపడానికి వీరూ రాక దోహదపడుతుందని మాత్రం ధీమాగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మూడు, నాలుగు టెస్టుల్లో విజయం సాధించి సిరీస్‌ను ఎలాగైనా సమం చేయాలనే పట్టుదల కూడా వీరూ చేరికకు మరో కారణంగా చెప్పాలి.
ఈ చేరికను విజయంగా మలచుకుంటే వ్యక్తిగతంగా వీరూకు, జట్టుపరంగా భారత్‌కు చిరస్మరణీయమైన అనుభూతి మిగిల్చిన ఘనత సెహ్వాగ్‌కు దక్కుతుంది. అయితే, వీరూ క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు కాస్త సంయమనం పాటించాల్సి ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా.. టీమ్ ఇండియా పట్ల వీరూ ఆపద్బాంధవుని పాత్రను పోషించి, తనపై ఉన్న నమ్మకాన్ని సార్థకత చేసుకోవాల్సిన తరుణం ఇదే.