దక్షిణాఫ్రికా విజయం : 4-1తో సిరీస్ కైవసం

శుక్రవారం, 30 జనవరి 2009 (18:46 IST)
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 289 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని అపజయం పాలయ్యింది. నిర్ణీత 50 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైన ఆసీస్... కామన్వెల్త్ బ్యాంక్ ఐదు వన్డేల సిరీస్‌ను, దక్షిణాఫ్రికాకు 4-1 తేడాతో కట్టబెట్టింది.

దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డ ఆమ్లాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించగా, మోర్కెల్‌ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సోట్సోబే అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లలో మైక్ హస్సీ (78), హాడిన్ (63), డేవిడ్ హస్సీ (32), మార్ష్ (5), పాంటింగ్ (12) పరుగులు చేయగా, క్లార్క్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు సాధించింది. ఈ జట్టులో అత్యధికంగా ఆమ్లా (97), డివిలియర్స్ (60), డ్యుమినీ (60) పరుగులు సాధించారు.

ఆసీస్ బౌలర్లలో హోప్స్ మూడు వికెట్లు, హిల్‌ఫెనాస్ రెండు వికెట్లు, జాన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇదిలా ఉంటే... ఇప్పటికే సిరీస్ కోల్పోయి దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఆసీస్ శుక్రవారంనాటి ఐదో వన్డేలో కూడా అపజయంపాలై ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్‌ను చేజార్చుకుంది.

వెబ్దునియా పై చదవండి