మొహాలీలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు నిలకడగా రాణిస్తోంది. శుక్రవారం ఉదయం టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గంభీర్, సెహ్వాగ్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. జట్టు స్కోరు ఆరు పరుగుల మీద ఉండగా.. డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్ అయ్యాడు.
గాయం నుంచి కోలుకుని తుది జట్టులోకి వచ్చిన ఇంగ్లీష్ బౌలర్ బ్రాడ్ తన తొలి ఓవర్ ఆఖరి బంతికి సెహ్వాగ్ వికెట్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత గంభీర్‌తో జతకలిసిన సీనియర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్ ఆరంభంలో ఆచితూచి ఆడారు. అసలే ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న ద్రావిడ్ ఇన్నింగ్స్ ప్రారంభమైన రెండో ఓవర్లోనే క్రీజ్‌లోకి వచ్చి నింపాదిగా ఆడుతున్నారు.
గంభీర్, ద్రావిడ్‌లు ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పెంచారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడటమే కాకుండా అభేద్యమైన 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో గంభీర్ 101 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతోనూ, రాహుల్ ద్రావిడ్ 153 బంతుల్లో ఆరు ఫోర్లతో అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు 84, 51 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అయితే భారత పరుగుల వేట చాలా నెమ్మదిగా సాగుతోంది.