ఆమధ్య పవన్ కళ్యాణ్ తన గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక అనే పాటకు డ్యాన్స్ చేస్తుంటే మెగాస్టార్ చిరంజీవి కాళ్లు కూడా ఆగలేదట. స్టెప్పులేయాలని ఉబలాట పడినా సీట్లో కాస్త గట్టిగా కాళ్లను అదిమిపట్టి కూర్చున్నాడట. ఇక్కడ విషయం ఏంటంటే... ఓ అంశంపైన పూర్తి నైపుణ్యం ఉన్నవారు ఎదుటివారు అదే అంశాన్ని ఉత్కంఠభరితంగా సాగిస్తుంటే వీరి ఆనందానికి హద్దులు ఉండవు. అదన్నమాట. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే... నిన్న రాత్రి భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ గురించి. ఈ ఆటను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చూసి ఆస్వాదించాడు. ట్వీట్లు కూడా చేశాడు.
మూడు కీలక వికెట్లు పడిపోయిన సందర్భంలో భారత్ రికార్డును పాక్ చెరిపేస్తుందా అని అందరూ అనుకుంటున్నప్పుడు కోహ్లి వీరవిహారం చేసాడు. భారీ షాట్లతో భారత్ కు విజయాన్ని అందించాడు. ఐతే పాక్-భారత్ క్రికెట్ అంటే మామూలుగా ఉండదు. మైదానంలో చాలా జరుగుతుంటాయి. ఆటగాళ్లు పళ్లు కొరుకుతారు. యాక్షన్లు చేస్తుంటారు. వెక్కిరిస్తుంటారు. ఇలా నానా హంగామా చేస్తుంటారు. ఇలాంటిదే సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల ప్రాయంలో పాక్ వర్సెస్ ఇండియా సమయంలోనూ జరిగింది.
1989లో 16 ఏళ్ల సచిన్ 4x6, 1x4 కొట్టినప్పుడు...
అది 1989వ సంవత్సరం. 16 ఏళ్ల గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ నూనూగు మీసాలతో క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో అతడికి బౌలింగ్ చేసేందుకు పాక్ ఉద్ధండ బౌలర్లు రంగంలోకి దిగారు. ఇంతలో వర్షం ముంచుకొచ్చింది. మ్యాచ్ ఓవర్లను 50 నుంచి 20-20గా కుదించారు. సచిన్ బ్యాటింగ్. ముస్టాక్ అహ్మద్ బౌలర్. రెండు సిక్సర్లు బాదాడు సచిన్. అంతే.... అబ్దుల్ ఖాదిర్ కు కోపమొచ్చింది. సచిన్ వైపు చూస్తూ... టేక్ ఆన్ ఎ మ్యాన్ అంటూ తన ఓవర్ మొదలెట్టాడు. సచిన్ లోలోన పళ్లు పటపటలాడిస్తూ... ఆ ఓవర్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ తో సమాధానమిచ్చాడు. ముస్టాక్ కళ్లు బైర్లు కమ్మాయి. చూడండి ఈ వీడియోలో( యూ ట్యూబ్ నుంచి)