యువరాజ్ అన్నంత పనీ చేశాడు. మనిద్దరం జోడీగా ఆడితే అద్భుతాలు జరుగుతాయి అని ముందే చెప్పిన టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నిజంగానే జూలు విదిల్చాడు. ఆడే అవకాశం లభిస్తే నవరక్తమే కాదు పాత రక్తం కూడా ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తుందని రెండో వన్డే సాక్షిగా యువరాజ్ నిరూపించి చూపాడు. తన ఎంపిక అనుకోని భాగ్యం కాదని, కోహ్లీ అభిమానం అంతకన్నా కాదని టీమిండియాలో ఎవరికీ తీసిపోని ప్రతిభాపాటవాల దన్నుతోనే జట్టులోకి వచ్చానని మాటల్తో కాకుండా ఒకే ఒక ఇన్నింగ్స్‌తో రుజువు చేశాడు.
కేన్సర్ బారిన పడి ఇక క్రికెట్‌తో సంబంధం పోయిందని ప్రపంచం భావించిన నిరాశా పరిస్థితులను గుండె ధైర్యంతో ఎదుర్కొని నిలబడ్డ యువీ తన నిబద్ధత కంటే కేన్సర్ ప్రమాదకారి కాదని బారామతి స్టేడియం సాక్షిగా నిరూపించి చూపాడు. సరైన జోడీ కుదిరింతే, అనుభవం పరీక్షకు గురైతే తననుంచి ఎలాంటి ఫలితం వస్తుందో యువ ఆటగాళ్లకు యువరాజ్ రుచి చూపాడు. ఆ క్రమంలో ఒకే ఇన్నింగ్సులో ఎన్ని రికార్డుల సష్టించాడో.
భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కటక్ లోని బారామతి స్టేడియంలో ఇంగ్లండుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో యువరాజ్(150) అత్యధిక వ్యక్తిగత పరుగులు నమోదు చేసి తన పునరాగమాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్పై అత్యధిక వన్డే వ్యక్తిగత పరుగులు సాధించిన ఏకైక భారత క్రికెటర్ గా గుర్తింపు సాధించాడు. దీనిలో భాగంగానే ఇంగ్లండ్‌పై గతంలో తన పేరిటే ఉన్న అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును యువీ సవరించాడు.
2008లో ఇంగ్లండ్‌పై యువరాజ్ నమోదు చేసిన 138 వ్యక్తిగత పరుగులే ఇప్పటివరకూ భారత్ తరపున అత్యధికం. దాన్ని యువరాజ్ తాజాగా అధిగమించడమే కాకుండా, వన్డే కెరీర్లో అత్యధిక పరుగుల్ని నమోదు చేశాడు. ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన అంతర్జాతీయ క్రికెటర్లలో వివియన్ రిచర్డ్స్(189నాటౌట్), గప్టిల్(189 నాటౌట్)లు తొలి స్థానంలో ఉండగా, షేన్ వాట్సన్(161) రెండో స్థానంలో, సనత్ జయసూర్య(152) మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత హషీమ్ ఆమ్లా(150), యువరాజ్(150)లు సంయుక్తంగా నాల్గో స్థానంలో ఉన్నారు.