ఒక్క నో బాల్ పడితే ఎవరి కొంపా మునగదు కానీ.. భారత్ కొంప మాత్రం బూమ్రా బాగా ముంచాడు

సోమవారం, 19 జూన్ 2017 (07:01 IST)
ఒక్క నోబాల్ పడితే కొంప మునుగుతుందా ఏంటి అని ఎవరైనా తేలికగా కొట్టిపారేసేవారు ఉంటే వారు తమ అభిప్రాయాన్ని మార్చుకోవలిసిందే మరి. ఎందుకంటే ఆదివారం చాంపియన్స్ ట్రోపీ ఫైనల్ పోటీలో బూమ్రా వేసిన ఆ బంతి టీమిండియా భాగ్యరేఖనే మార్చిపడేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితి తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌కు కూడా ఏర్పడే బంగారు అవకాశాన్ని బూమ్రా చేతులారా దూరం చేశాడు.

డెత్ బౌలింగ్‌కు మారుపేరుగా నిలిచిన బూమ్రా టీమిండియా కీలక విజయాలు సాధించాల్సిన ప్రతిసారీ నోబాల్స్‌తో నిలువునా కొంప ముంచడం అలవాటుగా చేసుకుంటున్నాడు. ఏ కీలక టోర్నీ జరిగినా లీగ్ పోటీల వరకు ప్రత్యర్థి జట్లను అదరగొట్టే టీమిండియా తన తురుపుముక్క బౌలర్ నిర్వాకం వల్లే సెమీ ఫైనల్, ఫైనల్ పోటీల్లో చతికిల పడుతోంది. 
 
ప్రధానంగా నో బాల్స్ వల్ల భారత్ అనేక కీలక మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. తాజాగా చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో జరుగుతున్న తుది పోరులో సైతం భారత్ జట్టు నిర్లక్ష్యపు బౌలింగ్ వల్ల భారీ మూల్యం చెల్లించుకుంది. భారత ప్రధాన పేసర్ బూమ్రా వేసిన నాల్గో ఓవర్ తొలి బంతి పాకిస్తాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ బ్యాట్ ను తాకి వికెట్ కీపర్ ధోని చేతుల్లో పడింది. అయితే అది నో బాల్ కావడంతో జమాన్ బతికిపోయాడు. అప్పుడు ఫకార్ జమాన్ వ్యక్తిగత స్కోరు 3. కాగా, ఆపై రెచ్చిపోయిన జమాన్ ఏకంగా సెంచరీ సాధించి పాక్ భారీ స్కోరుకు బాటలు వేశాడు.
 
కాగా,  2016లో జరిగిన ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 గుర్తుండే ఉంటుంది. వెస్టిండీస్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అప్పుడు బూమ్రా వేసిన నో బాల్ వల్లే విండీస్ సునాయాసంగా గెలిచి ఫైనల్‌కు చేరింది. లెండిల్ సిమన్స్‌ను ముందులోనే బూమ్రా అవుట్ చేసినప్పటికీ, అది నో బాల్ కావడంతో అతను బతికిపోయాడు. ఆపై మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులతో అజేయంగా నిలిచి విండీస్‌ను ఫైనల్ కు చేర్చాడు.
 
ఇప్పుడు పాకిస్తాన్ మ్యాచ్‌లో జమాన్ శతకంతో మెరవడం ఆ ఘటనను గుర్తుకు తెస్తుంది. ఈ రోజు మ్యాచ్‌లో బూమ్రా వేసిన నో బాల్‌తో లైఫ్ వచ్చిన ఫకార్ దాన్ని చక్కగా  సద్వినియోగం చేసుకుని సెంచరీ సాధించాడు. 92 బంతుల్లో శతకం చేసి పాకిస్తాన్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్‌లో ఫలితం పాకిసాన్‌కు అనుకూలంగా మారటానికి నూటికి నూరుపాళ్లూ బూమ్రా నో బాలే కారణం అనడంలో ఎటువంటి సందేహం లేదు. 
 
ఒక నో బాల్ పడితేనే అంత కొంప మునుగుతుందా అనేవారికి ఒకే ప్రశ్న. పాక్ బ్యాటింగులో 3 పరుగుల వద్దే బూమ్రా బంతికి పాక్ బ్యాట్స్‌మన్ ఫకర్ జమాన్ ఔటయి ఉంటే తొలి ఓవర్లలో కీలక వికెట్ పడిన ఎఫెక్టు చాలా భిన్నంగా ఉండేది. పాకిస్తాన్ జట్టు రెండో ఇన్నింగ్‌లో తొలి ఓవర్ నుంచి వికెట్లు పడగొట్టడం ద్వారా పానిక్ బటన్‌ను ప్రారంభంనుంచే టీమిండియా నొక్కి చేతులారా విజయాన్ని దూరం చేసుకునేలా చేసిందని మర్చిపోవద్దు. రెండు జట్ల మధ్య ప్రధానమైన తేడా పాక్ తాననుకున్నది చేసి చూపింది. భారత్ అలా చేయలేక చతకిలబడింది. 
 
అసలు విషయం ఏమిటంటే కీలకమైన ఫైనల్లో బూమ్రా ఒకటి కాదు మూడు సార్లు నోబాల్స్ వేసి ఇద్దరిని ఔట్ చేసే స్థితిని తప్పించాడు. భవిష్యత్తు పోటీల్లో టీమిండియా చాలా సీరియస్‌గా దృష్టిపెట్టాల్సిన అంశం ఇదే మరి.
 

వెబ్దునియా పై చదవండి