ఆదివారం ఓవల్‌లో మ్యాచ్ అనంతరం తన మిత్రుడు డివీలియర్స్‌తో కోహ్లీ మాట్లాడుతూ ఎమ్ఎస్ ధోనీతో పెట్టుకోవద్దు అంటూ సూచించినట్లు తెలుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో కుదురుగా ఆడుతున్న సఫారీ జట్టులో కీలకమైన ఆటగాడు హెచ్ ఆమ్లా టీమిండియా స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా పట్టిన ధోనీ అప్పటినుంచి సఫారీ జట్టులో పానిక్ బటన్ ప్రారంభం కావడానికి కీలక పాత్ర పోషించాడు. తను పట్టాల్సిన ఆ క్యాచ్‌ను ధోనీ ఒడిసి పట్టుకుని మేలు చేశాడని, తనకయితే ఆ క్యాచ్ పట్టడం కష్టమయ్యేదని కోహ్లీ చెప్పాడు.
డివీలియర్స్‌తో ఇదే విషయంపై మాట్లాడిన కోహ్లీ.. ఎమ్ఎస్ ధోనీని ఎన్నడూ తేలికగా తీసుకోవద్దని, భారత క్రికెట్‌లో మాకందరికీ అతడిపై అదే అభిప్రాయం ఉందని పేర్కొన్నాడు. తనకు అందకుండా దూరంగా పైకి వెళుతున్న బంతిని ధోనీ ఎగిరి క్యాచ్ పట్టి ఆమ్లాను ఔట్ చేయడమే మ్యాచ్‌ను మలుపు తిప్పిందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
కోహ్లీ మాటలను డివీలియర్స్ కూడా అంగీకరిస్తూ తెల్లజుట్టు వస్తున్నప్పటికీ ధోనీ రాన్రానూ మైదానంలో కుర్రాడిలాగా స్పీడ్ పెంచుతున్నాడని వ్యాఖ్యానించాడు. ఎంఎస్ ధోనీకి వయసు మీరుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ క్యాచ్‌లు పట్టే అతడి చేతులు మాత్రం మరింత చురుకుగా తయారవుతున్నాయని, ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఏ వికెట్ కీపర్‌కీ సాధ్యం కానంత వేగంగా వికెట్లు గిరాటేయడంలో ధోనీయే సిద్ధహస్తుడని డివీలియర్స్ ప్రశంసించాడు.
తానూ, డుప్లెసిస్ ఇద్దరం మైదానంలో చురుగ్గా పరిగెత్తేవారిమే అయినప్పటికీ పాండ్యా మెరుపువేగంతో విసిరిన త్రో ధోనీవద్దకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా భయకంపితులమయ్యామని, ఏం జరుగుతుందో చూస్తుండగానే నా వికెట్ పడిపోయిందని డివీలియర్స్ చెప్పాడు. పైగా ఈత కొలనులో పోల్‌ను ముందుగా చేరాలని స్విమ్మర్లు ఉరికేంత వేగంగా ఒక ఎండ్‌కు ఇద్దరు బ్యాట్స్‌మన్లమూ పరుగెత్తడం ఈరోజు మాత్రమే కాదు ఇప్పటికి ఆరుసార్లు ఇలా జరిగిందన డివీలియర్స్ వాపోయాడు.
సఫారీ జట్టులో డివీలియర్స్, డేవిడ్ మిల్లర్ ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటగాళ్లు. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా ఆటను ప్రత్యర్థి జట్టునుంచి లాగేసుకునేటంత సిద్ధహస్తులు. అలాంటి వారు మైదానంలో ధోనీని చూసి అంతగా భయపడ్డారంటే ప్రత్యర్థి జట్టుపై ధోని వేస్తున్న ప్రభావం స్థాయి ఎలాంటిదో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు.