రవిశాస్త్రి అయితే మాకు ఒకే.. సూచించిన కోహ్లీ.. ఇది క్రికెట్ బోర్డేనా?
గురువారం, 22 జూన్ 2017 (02:37 IST)
అటు అహంకారంతో కన్నూ మిన్ను కానకుండా విర్రవీగుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇటు చేవ చచ్చి నిర్వీర్యమైపోయిన బీసీసీసీ కలిసి భారత క్రికెట్ చరిత్రలోనే అతి గొప్ప లెజెండ్స్‌లో ఒకరైన అనిల్ కుంబ్లేని ఇంటికి పంపించేశారు. ఆధునిక క్రికెట్ చరిత్రలోనే ఇంత అవమానకరంగా ఒక ప్రతిభావంతుడైన కోచ్‌ను అర్థంతరంగా సాగనంపిన ఘటన మరేదేశంలోనూ జరగలేదు.
అరయంగా కర్ణుడీల్గె ఆర్గురి చేతన్ అన్నట్లుగా కుంబ్లే గుండెపగలగొట్టి సాగనంపిన బీసీసీఐ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం మరోసారి కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించనుంది. వాస్తవానికి మే 31తోనే ఈ గడువు ముగిసినా... తాజాగా కుంబ్లే నిష్క్రమణ అనంతరం ఆసక్తిగల వారి నుంచి మళ్లీ అప్లికేషన్‌లు తీసుకుంటే బాగుంటుందని బోర్డు భావిస్తోంది.
దరఖాస్తు పంపేందుకు వారం నుంచి పది రోజుల గడువు ఇచ్చే అవకాశం ఉంది. ‘మేం ఇంతకు ముందు దరఖాస్తులు తీసుకున్న సమయంలో కుంబ్లే కూడా బరిలో ఉన్నారు. అతని రికార్డు వల్ల మళ్లీ కుంబ్లేనే కొనసాగే అవకాశం ఉందని, పోటీ పడినా ఫలితం లేదని చాలా మంది భావించి ఆగిపోయారు. ఇప్పుడు కుంబ్లే లేకపోవడంతో పరిస్థితులు మారిపోయాయి. ఈ సమయంలో మరికొందరు ఆసక్తిగా ముందుకు వస్తున్నారు’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.
ప్రస్తుతం సెహ్వాగ్, మూడీ, రాజ్‌పుత్, పైబస్, దొడ్డ గణేశ్ దరఖాస్తులు మాత్రమే బీసీసీఐ వద్ద ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే ముందే రవిశాస్త్రి కోచ్‌గా ఉంటే బాగుంటుందంటూ కోహ్లి సూచించినట్లు వార్తలు వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కోహ్లి మాట చెల్లుబాటయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.
మరోవైపు కుంబ్లే, కోహ్లి విభేదాలకు సంబంధించిన పరిణామాలపై తమకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రిని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ కోరారు.
ఒకటి మాత్రం నిజం. రవిశాస్త్రి వంటి పచ్చి కెరీరిస్టును, స్వార్ధపరుడిని బీసీసీఐ కోచ్‌గా నియమిస్తే ఆటగాళ్లు ఆడిందే ఆట కాక తప్పదు. అప్పుడు కోహ్లీ ఎంచక్కా ప్రాక్టీసు కూడా మాని అనుష్కతోనో మరో తనుష్క తోనో వీధుల్లో చక్కర్లు కొట్టవచ్చు. ఇక టీమిండియా ఆడగాళ్లు అసలిపోయామని ప్రాక్టీసు మాని షాపింగులకు పోవచ్చు. మరుసటి రోజు మ్యాచ్ పెట్టుకుని అర్థరాత్రి తర్వాత కూడా పార్టీల్లో మునిగి తేలవచ్చు.
బీసీసీఐ సీఓఏ వినోద్ రాయ్ ఈ వ్యవహారం పట్ల కూడా సీరియస్‌గా దృష్టి పెడితే బాగుంటుందేమో..