ఆసీస్ గెలిచిందా.. శ్రీధరన్ ఓడించాడా?

ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (06:33 IST)
భారత్-ఆస్ట్లేలియా టెస్ట్ సీరీస్ తొలి టెస్టులో ఆతిథ్య జట్టుపై ఆస్ట్లేలియా సాధించిన విజయానికి పూర్తి అర్హురాలు ఆసీస్ జట్టుదే అనడంలో సందేహమే లేదు. కానీ స్పిన్ పిచ్ అంటేనే వణుకుపుట్టి ముందే ఆటను వదిలేసుకునే ఆస్ట్లేలియా చిత్తుచిత్తుగా భారత్‌ను బాదిపడేయటం ఏమిటి? స్పిన్ పిచ్‌పై ఎలా ఆడాలో ప్రపంచానికే ఆట నేర్పుతా అన్నట్లుండే భారత్ ఆ స్పిన్‌కే గింగిరాలు తిరుగుతూ కూలిపోవడం ఏమిటి? అంటే సమాధానం ఒక్కటే, శ్రీధరన్ శ్రీరామ్. ఆసీస్ జట్టు మెంటర్‌గా, స్పిన్ కన్సల్టెంట్‌గా వ్యవహరించిన ఈ భారత మాజీ ఆటగాడు గెలుపు, ఓటమికి మధ్య ఉన్న వారను పుణె స్టేడియం సాక్షిగా ప్రదర్శించి చూపాడు. భారత టీంను కాదు. కోట్లాది భారతీయులనే కాదు క్రికెట్ ప్రపంచం యావత్తును దిగ్భ్రాంతి పర్చిన ఈ పరిణామానికి అతడు ఎలా మూలకారకుడయ్యాడు?
 
నాలుగేళ్ల క్రితం 0–4తో అవమానకర రీతిలో ఓడిన సమయంలో పరాభవంతో పాటు ‘హోం వర్క్‌’ వివాదాన్ని కూడా వెంట తీసుకొచ్చిన ఆస్ట్రేలియా ఈసారి అసలైన ‘హోం వర్క్‌’తో సన్నద్ధమైంది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఎలాగూ స్పిన్‌ వికెట్‌ ఇవ్వరని తెలుసు కాబట్టి దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో తన సన్నాహాలు చేసింది. భారత్‌లో వికెట్లను రూపొందించేందుకు వాడే మట్టితో ప్రత్యేకంగా తయారు చేయించిన పిచ్‌లపై ఆ జట్టు కఠోర సాధన చేసింది. సాధారణంగా స్పిన్‌లో షార్ట్‌లెగ్, సిల్లీ పాయింట్‌లాంటి స్థానాల్లో క్యాచ్‌ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బంతి ఏ రకంగా వచ్చినా ఆ స్థానాల్లోకి ఆడకుండా బ్యాట్స్‌మెన్‌ ప్రాక్టీస్‌ చేశారు.
 
 ఈ టెస్టులో ఆస్ట్రేలియా కోల్పోయిన 20 వికెట్లలో ఎవరూ క్లోజ్‌ ఇన్‌ ఫీల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ కాకపోవడం విశేషం. ఆ జట్టుకు స్పిన్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరించిన భారత మాజీ ఆటగాడు శ్రీధరన్‌ శ్రీరామ్‌ జట్టుతో ఈ వికెట్లపై ప్రాక్టీస్‌ చేయించాడు. ఓకీఫ్‌ బౌలింగ్‌ మెరుగు పడటంతో అతనిదే కీలక పాత్ర. 2012లో ఇంగ్లండ్‌ తరఫున భారత్‌ను దెబ్బ తీసిన మాంటీ పనెసర్‌ కూడా ఆసీస్‌ను సిద్ధం చేయించడంలో ఆ జట్టుకు సహకరించాడు. భీకరమైన పుణే పిచ్‌పైనే ఆసీస్‌ చేసిన స్కోర్లు... స్మిత్, రెన్‌షా ఆట చూస్తే సాధారణ స్పిన్‌ పిచ్‌పై వారు అలవోకగా ఆడగలిగేవారేమో అనిపిస్తుంది.
 
ఇప్పుడు చిన్నస్వామి స్టేడియం పిచ్‌ రూపంలోనే భారత్‌ ముందు పెద్ద సవాల్‌ నిలిచింది. పూర్తిగా స్పిన్‌ పిచ్‌ ఉంటే ఫలితం ఎలా ఉంటుందో పుణే చూపించింది. అలా అని బ్యాటింగ్‌ వికెట్‌ చేస్తే ఆసీస్‌లో కూడా మెరుగైన బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. పేస్‌ లేదా స్వింగ్‌కు అనుకూలించే విధంగా ఉంటే మన ఉమేశ్, ఇషాంత్‌ కంటే కచ్చితంగా స్టార్క్, హాజల్‌వుడ్‌ ఎక్కువ ప్రమాదకారిగా మారగలరు. సొంతగడ్డపై తొలి టెస్టు ఓడి భారత్‌ సిరీస్‌లో వెనుకబడిన సందర్భాలు చాలా తక్కువ. ఇలాంటి స్థితి నుంచి కోలుకొని మనోళ్లు ఎలా రాణిస్తారనేది చూడాలి.  
 

వెబ్దునియా పై చదవండి