మొహాలీలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 453 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ గంభీర్ (179), రాహుల్ ద్రావిడ్ (136) మినహా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేక పోయారు. దీంతో భారీ స్కోరు చేసే అరుదైన అవకాశాన్ని 'టీమ్ ఇండియా' చేజార్చుకుంది.
తొలి ఓవర్ నైట్ స్కోరు 179/1తో రెండో రోజు ఉదయం ఆటను ప్రారంభించిన భారత్‌కు గంభీర్-ద్రావిడ్ జోడీ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో 314 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం స్వాన్ బౌలింగ్‌లో గంభీర్ 179 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. జట్టు స్కోరుకు మరో తొమ్మిది పరుగులు జోడించాక ద్రావిడ్ కూడా తన వ్యక్తిగత స్కోరు 139 వద్ద అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సచిన్ (11), లక్ష్మణ్ (0), యువరాజ్ సింగ్ (27), ధోనీ (29), హర్భజన్ సింగ్ (24), జహీర్ ఖాన్ (7), అమిత్ మిశ్రా (23) లు తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. దీంతో భారత్ 158.2 ఓవర్లలో భారత్ 453 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్లింటాఫ్, స్వాన్లు మూడు చొప్పున, పనేసర్ రెండు, ఆండర్సన్, బ్రాడ్లు ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.