అందరూ ఊహించినట్టుగానే మొహాలీ టెస్టు డ్రాగా ముగిసింది. దీనికి పొగమంచు కారణంగా నిలిచింది. భారత్-ఇగ్లండ్ జట్ల మధ్య ఈనెల 19వ తేదీన మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఇందులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 453 పరుగులకు ఆలౌట్ అయింది.
గంభీర్ 179, రాహుల్ ద్రావిడ్ 136 చొప్పున పరుగులు చేసి గట్టి పునాది వేసినప్పటికీ.. తర్వాత బ్యాట్స్‌మెన్స్ రాణించలేదు. అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందులో పీటర్సన్ 144, కుక్ 50, ఫ్లింటాఫ్ 62 చొప్పున పరుగులు చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్ కంటే 152 పరుగుల వెనుకబడింది.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్.. ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఇందులో గంభీర్ (97), యువరాజ్ సింగ్ (86) పరుగులతో రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. మ్యాచ్ ఆఖరి రోజున లంచ్ వరకు రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్.. ఇంగ్లండ్ ముంగిట 403 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
ఆతర్వాత బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్, ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. వెలుతురు మందగించడంతో మ్యాచ్‌ను నిర్ణీత సమయం కంటే ముందుగానే నిలిపివేశారు. అంతేకాకుండా మ్యాచ్ ఫలితం తేలదని నిర్ధారణకు వచ్చిన ఇరు జట్ల కెప్టెన్లు డ్రాగా ముగించేందుకు సమ్మతించారు.
డ్రాతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గౌతం గంభీర్ అందుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ గెలుచుకున్నాడు.