హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన కేసులోని నిందింతులకు ఓ ప్రజాప్రతినిధి తన ఫామ్ హౌస్‌లో ఆశ్రయం కల్పించినట్టు వార్తలు వస్తున్నాయి. శనివారం రాత్రి కర్నాటకలోని గుల్బర్గాలో ఉన్న ఒక మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఆ కుర్రోడిని ఓ రహస్య ప్రాంతానికి తరలించి విచారించారు. అలాగే, మరో నిందితుడిని కూడా అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టు చేసిన నిందితుల సంఖ్య ఐదుకు చేరిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లో ఉన్న ఒక ఫాంహౌస్‌లో వద్ద ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఓ రాజకీయ పార్టీ నేతకు చెందిన ఫాంహౌస్‌లోనే తలదాచుకున్నారని, అక్కడ నుంచి వేర్వేరు ప్రాంతాలకు పరారయ్యారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పైగా, తాము వినియోగించిన ఇన్నోవా కారును కూడా ఆ ఫాంహౌస్ వెనుక భాగంలో వారు దాచిపెట్టారు.
అంతేకాకుండా, అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరికి కొత్త సిమ్ కార్డులు వేసి గోవాకు పంపించినట్టు తెలిపారు. ఆ తర్వాత మరికొందరు కర్నాటకకు పారిపోయారు. ఆశ్రయం ఇచ్చిన ఫాంహౌస్ యజమాని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో అరెస్టు చేసిన ఓ నిందితుడికి చెందిన ఫాంహౌస్‌గా భావిస్తున్నారు.