అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తారా...?: మేడమ్ సీరియస్

వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరిన రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు మేడమ్ నుంచి మందలింపులు ఎదురయ్యాయి. ఒకవైపు కీలకనేత, ప్రజామనసులను గెలుచుకున్న మహానాయకుడు కోల్పోయిన దుఃఖం నుంచి పార్టీ తేరుకోక ముందే జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు చూపిన అత్యుత్సాహంపై సోనియాగాంధీ సీరియస్ అయినట్లు భోగట్టా.

సంతాప దినాలు ముగిసిన తర్వాత అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పినా.. పెడచెవిన పెడుతూ జగన్ ముఖ్యమంత్రిత్వంపై మద్దతు లేఖలతో ఢిల్లీకి ఎందుకు వస్తున్నట్లు అని కేంద్రం నుంచి అసంతృప్తి ఎదురైనట్లు సమాచారం.

అన్నిటికీ మించి దివంగత నేత రాజీవ్ గాంధీతో జగన్ మోహన్ రెడ్డిని కొందరు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోల్చి మాట్లాడటంపై అధిష్ఠానం తీవ్ర అసంతృప్తికి కారణమైందని సమాచారం. మొత్తమ్మీద జగన్ ముఖ్యమంత్రిత్వం డైలామాలో పడినట్లు తెలుస్తోంది.

ఇదే అదనుగా జగన్ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా కొందరు నాయకులు పావులు కదుపుతున్నట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్‌కు ప్రస్తుతం అనుభవజ్ఞుడైన సీనియర్ నేత ముఖ్యమంత్రిగా కొనసాగించాల్సిన అవసరం ఉందనీ, ఈ క్రమంలో రోశయ్యను అలాగే కొనసాగిస్తే అన్నివిధాలా మంచిదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొందరు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి