ఆ నీళ్లు దిక్కులేని రాయలసీమా.. కోస్తాలకిచ్చుకో: కేసీఆర్

FILE
మానవ తప్పిదం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల వల్లే రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టించిందనీ, దీనికి ప్రధాన కారకుడు మంత్రి పొన్నాల లక్ష్మయ్య అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేసీఆర్ "వరద" రాజకీయం చేస్తూ యదార్థాలను కప్పిపుచ్చుతూ ప్రజలను తప్పుదోవ పట్టించుకేందుకు కుట్ర పన్నుతున్నారని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యల్లో రవ్వంత కూడా యదార్థం లేదని, తాము ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యామని పొన్నాల ప్రకటించారు.

పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యల అనంతరం కేసీఆర్ హడావుడిగా ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా ముందు పొన్నాలపై విరుచుపడ్డారు. రాష్ట్రంలో నీటి వాడకంపై మాట్లాడుతూ 68 శాతం నీటి నిలువలున్న తెలంగాణా ప్రాంతంమీద ఆధారపడి కోస్తా, రాయలసీమలు బతుకుతున్నాయన్నారు.

వరదలపై తన వాదన తప్పని నిరూపిస్తే బహిరంగంగా ఉరికి సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ ప్రకటించారు. విలేకరుల సమావేశంలో ఎప్పటిలాగే విచక్షణను మరిచి రాష్ట్ర మంత్రి పొన్నాలపై విసుర్లు విసిరారు. పొన్నాలను "సన్నాసి" అని సంభోధించడమేకాక రాష్ట్రంలో నీటి వినియోగంపై మాట్లాడుతూ ఒక సందర్భంలో "దిక్కులేని రాయలసీమా... దిక్కులేని కోస్తా" అని దుర్భాషలాడారు.

కేసీఆర్ వ్యాఖ్యలను పలువురు నాయకులు తీవ్రంగా ఖండించారు. తన ఉనికిని కోల్పోతున్నానన్న అనుమానం వచ్చినపుడు కేసీఆర్ ఇటువంటి చవకబారు వ్యక్తిగత దూషణలు దిగుతుంటారని అభిప్రాయపడ్డారు. తను నమ్ముకున్న వాదాన్ని బలపరచడం చేతకాక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను దూషించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

ఇటువంటి వ్యాఖ్యలు ప్రాంతీయ అసమానతలను, విరోధాన్ని తీసుకువస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణా అయినా రాయలసీమ అయినా కోస్తా ప్రాంతమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ శాంతస్వభావులని వారి మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు తగవని హితవు పలికారు. మరి వారి ఆవేదన కేసీఆర్ చెవికి చేరుతుందో లేదో...

వెబ్దునియా పై చదవండి