నందమూరి హరికృష్ణకు అంత సీనుందా!!

తెలుగుదేశం పార్టీలో సరికొత్త వివాదానికి తెరలేపిన నందమూరి హరికృష్ణకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఎదుర్కొనే దమ్మూ, సత్తా ఉందా? ప్రస్తుతం ఈ అంశంపై రాష్ట్రంలో తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబును అపర చాణుక్యడిగా పేరుగడించారు. రాజకీయాల్లో పావులు కదపడంతో పాటు.. ఎత్తుకు పైఎత్తులు వేయడంలో ఆయనకు మించినవారు లేరంటారు.

అయితే, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని హరికృష్ణ సంధించిన లేఖ ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి, ఆయన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు గానీ, పురంధేశ్వరిపై ఎర్రంనాయుడు చేసిన విమర్శలు గానీ ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి.

ఈ వాతావరణంలో నందమూరి కుటుంబంలో కూడా చిచ్చు రగిలినట్లు తెలుస్తోంది. సినీ హీరో, హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ చంద్రబాబుకు మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరికృష్ణకు కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. దగ్గుబాటి పురంధేశ్వరి వెనుక నుంచి కథ నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ హరికృష్ణకు చంద్రబాబును ఎదుర్కొనే బలాన్ని అందిస్తాయా అనేది సందేహమే.

అంతేకాకుండా హరికృష్ణకు ఇప్పటికే చంద్రబాబు దెబ్బను రుచి చూశారు. ఎన్టీ రామారావును పదవీచ్యుతుడ్ని చేసిన సమయంలో హరికృష్ణతో పాటు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు చంద్రబాబుకు మద్దతు తెలిపారు. అధికారం తన చేతుల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వారి స్థాయిని తగ్గిస్తూ వచ్చారు.

తెలుగుదేశం పార్టీ పురావైభం సంతరించుకోవాలంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ముందుకు రావాలని ఆ వర్గం చాలా కాలంగా వాదిస్తోంది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కొంత మంది నాయకులు వాదిస్తున్నారు. బాలకృష్ణను పార్టీ అధ్యక్షుడిగా, జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగు యువత సారథిగా నియమించాలని వారు వాదిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి