పడి లేచిన కెరటం: ఫలించిన ఆరేళ్ళ కల

PNR

FileFILE
ఒమర్ అబ్దుల్లా.. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత. అబ్దుల్లా కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం నేత. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. 26 సంవత్సరాలకే కేంద్ర మంత్రి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన ఒమర్.. సరిగ్గా పదేళ్ళ తర్వాత అంటే.. తన 36వ యేట రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం గమనార్హం.

1970లో జన్మించిన ఒమర్‌కు చిన్న వయస్సులోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నది తన జీవిత కల. స్కాట్లాండ్‌లో బిజినెస్ విద్యను అభ్యసించిన ఒమర్.. 1998లో లోక్‌సభకు తొలిసారి ఎన్నికయ్యారు. ఎన్డీయే ప్రభుత్వంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి కేబినెట్‌లో కేంద్ర వాణిజ్య, విదేశీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఒమర్ బాధ్యతలు నిర్వహించారు.

అయితే తనకు జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఉందని, ఇది నెరవేరడమనేది తమ పార్టీపైనా, రాష్ట్ర ప్రజలపైనా ఆధారపడి ఉంటుందని తన మనస్సులోని మాటను వెల్లడించారు. 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, వెలువడిన ఫలితాలు పార్టీకి అనుకూలంగా వచ్చాయి. అయితే.. ఆ సమయంలో అదృష్టం ఒమర్ వైపు లేదు.

అబ్దుల్లా కుటుంబానికి కంచుకోటగా భావించే గందేర్భాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పరాజయం చవిచూశారు. దీంతో పార్టీ అభ్యర్థులు గెలిచినా.. ఒమర్ గెలవక పోవడంతో ఆ కల నెరవేరలేదు. అయితే ఒమర్ ఛరిష్మా మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తన నియోజకవర్గ ప్రజలకు దూరం కాకుండా మరింత దగ్గరయ్యారు.

గత ఏడాది అణు ఒప్పందం అంశంపై యూపీఏ సర్కారు విశ్వాస పరీక్షను ఎదుర్కొంది. ఆ సమయంలో యూపీఏకు అనుకూలంగా మద్దతు ప్రకటించారు. తాను తీసుకున్న నిర్ణయానికి వివరణ కూడా ఇచ్చారు. ముస్లిం యువకుడిగా అమెరికాను వ్యతిరేకిస్తానని, అయితే ఒక భారతీయుడిగా, నా దేశ ఇంధన అవసరాల రీత్యా అణు ఒప్పందానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించి అధికార, ప్రతిపక్ష నేతల మన్ననలు పొందారు.

అలా జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్న ఒమర్.. 2001 సంవత్సరంలోనే 'ప్రపంచ భవిష్యత్ నేత'గా ఒక అంతర్జాతీయ సంస్థ అవార్డును అందజేయడం గమనార్హం. అలాగే టెన్నిస్ క్రీడాకారుడైన ఒమర్ బాలీవుడ్ చిత్రంలో నటించి తన నటనాభిమానాన్ని చాటుకున్నారు.

వెబ్దునియా పై చదవండి