ప్రజా ఆస్తికంటే.. కార్పొరేట్ ఆస్తులే ముఖ్యమా..?!

శనివారం, 9 జనవరి 2010 (20:13 IST)
రాష్ట్రంలోని రోశయ్య సర్కారు మరో తప్పటడుగు వేసిందా? అవుననే అంటున్నారు రాజకీయ, మీడియా విశ్లేషకులు. మహోధృతంగా సాగిన ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా గత రెండు నెలలుగా పలు రకాల ఆందోళనలు జరిగాయి. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. వీటిపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. పైపెచ్చు సమస్య తమ చేతుల్లో లేదని, కేంద్రమే పరిష్కరించాలని చల్లగా సెలవిచ్చారు మన ముఖ్యమంత్రి.

ఫలితంగా సుమారు రెండు నెలల పాటు సామాన్య ప్రజానీకం పడరాని కష్టాలు పడింది. ప్రజలు ఎన్ని కష్టాలు పడినా డోంట్‌కేర్ అన్న చందంగా కేంద్ర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవహరించాయి. అయితే, ప్రజల మనిషి, మహానేత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణం ఘటనపై రష్యాకు చెందిన ఒక వెబ్‌సైట్ ప్రచురించిన ఊహా జనిత కథనాన్ని మూడు టీవీ ఛానల్స్ కథనంగా మార్చి ప్రసారం చేశాయి.

వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో రిలయన్స్ సంస్థ అధినేత హస్తం ఉన్నట్టు ఆ కథనం సారాంశం. దీంతో వైఎస్ అంటే పిచ్చి అభిమానం ఉన్న కొందరు రెచ్చిపోయారు. ఆ సంస్థకు చెందిన ఔట్‌లెట్‌లు, సెల్ టవర్లను ధ్వంసం చేశారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించాయి. కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసరంగా భేటీ అయింది. ఢిల్లీ ఆదేశాలతో రాష్ట్ర పోలీసులు నిద్రమత్తును వీడారు.

టీవీ-5 ఛానల్‌ ఎడిటర్, ఇన్‌పుట్ ఎడిటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో రాష్ట్రంలోని జర్నలిస్టులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది చల్లారకుండానే అంటే 24 గంటలు గడువక ముందే (శనివారం సాయంత్రం) సాక్షి టీవీ ఛానల్‌పై సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనా.., సినీ షూటింగ్‌లపై దాడులు జరిగినా..., పలు రాజకీయ నేతలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినా... మిన్నకుండిన రోశయ్య సర్కారు ఒక కార్పొరేట్ సంస్థకు చెందిన ఆస్తుల విధ్వంసంపై ఇలా స్పందించడంలో ఆంతర్యమేమిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యంగా, ప్రభుత్వం ఇదే వైఖరితో ముందుకు వెళితే ప్రజలే ప్రభుత్వాన్ని శంకించాల్సి వస్తుందన్నారు. ఇదే విషయాన్ని సాక్షి సీఈఓ రామ్ కూడా లేవనెత్తారు. రాష్ట్ర విభజన ఉద్యమంలో కోట్లాది రూపాయల ఆస్తులు ధ్వంసమైనా పట్టించుకోని ప్రభుత్వం ఒక కార్పొరేట్ సంస్థపై జరిగిన దాడికి ఇంతగా స్పందించడం విడ్డూరంగా ఉందని అన్నారు.

ఇదే భావనను రాజకీయ, మీడియా విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అంటే.. రోశయ్య సర్కారు మీడియాపై ఉక్కుపాదం మోపి మరో తప్పు చేస్తోందని, ఇది ప్రభుత్వానికే హాని చేస్తుందని వారు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి