ఫార్సుగా మారిన "అధిష్టానం సీరియస్సుగా ఉంది"

సోమవారం, 10 జనవరి 2011 (19:22 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుగుబావుటా ఎగుర వేసిన నాటి నుంచి పీసీసీ చీఫ్ అధిష్టానం సీరియస్సుగా ఉంది అనే మాటను ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పటికీ జగన్ వెంట నడుస్తున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెపుతూనే ఉన్నారు.

హస్తినలో రేపు వైఎస్ జగన్ తలపెట్టనున్న ఒక్కరోజు దీక్షకు... అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు ఓ 30 మందికి పైగా హాజరుకాబోతున్నట్లు వినికిడి. దీనిపై పీసీసీ చీఫ్ డీఎస్‌ను కదిలిస్తే.... అధిష్టానం చాలా సీరియస్‌గా ఉంది. పార్టీని ఎదిరించి దీక్షలో పాల్గొనేవారిపై ఖచ్చితంగా వేటు పడక తప్పదని హెచ్చరించారు. అయితే డీఎస్ మాటను సదరు ఎమ్మెల్యేలు గడ్డిపోచకంటే హీనంగా తీసిపారేస్తున్నారు. పైపెచ్చు కాంగ్రెస్ అధిష్టానానికి తమపై చర్య తీసుకునే దమ్మూ ధైర్యం లేదని ఎద్దేవా చేస్తున్నారు.

ఒక అడుగు ముందుకు వేసి ధైర్యం వుంటే తమపై వేటు వేసి చూడమని బెదిరిస్తున్నారు. కారణం... వేటుపడితే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుంది. కనుక జగన్ వెంట నడుస్తున్న ఎమ్మెల్యేలు ఎన్ని మాటలంటున్నా... హైకమాండ్ తలవంచుక కూచోవాల్సిందే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.

పీసీసీ చీఫ్ మాత్రం రేపు జగన్ దీక్షలో ఎంతమంది నాయకులు పాల్గొంటారో చూసిన పిదప స్పందిస్తామని చెపుతున్నారు. జగన్ వెంట దీక్షలో పాల్గొన్నవారిపై సరైన సమయంలో సరైన చర్య ఉంటుందని చెప్పిన మాటలనే చెపుతున్నారు. గత ఏడెనిమిది నెలలుగా ఇటువంటి హెచ్చరికలు చేయడం... తరువాయి ఎటువంటి చర్యలు లేకపోవడం... కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆ పార్టీ ప్రజాప్రతినిధులే ఎండగట్టడం మామూలైపోయింది. ఈ వ్యవహారమంతా సగటు జీవికి మాత్రం తమాషాను తెప్పిస్తోంది. రాజకీయాలంటే ఇలాక్కూడా ఉంటాయా...? అని ముక్కున వేలేసుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి