రాజానామాలు చేస్తామన్న "మొనగాళ్లు" ఏరీ..?! ఎక్కడ..?!!

సోమవారం, 4 జులై 2011 (12:08 IST)
గత నాలుగు రోజులుగా తెలంగాణాకోసం రాజీనామాలు చేస్తామన్న తెలంగాణా ఎంపీలు చెప్పిన సమయానికి పత్తా లేరు. స్పీకర్ మీరాకుమార్ అపాయింట్మెంట్ అడిగిన ఈ తెలంగాణా ఎంపీ వీరులు సమయానికి ఐపు లేకుండా పోయారు.

దీంతో సుమారు అరగంటపాటు పార్లమెంటులో వేచి చూసిన స్పీకర్, విసుగు చెంది తిరిగి వెళ్లిపోయారు. ఆలస్యంగా చేరుకున్న ఎంపీలు స్పీకర్‌ను మరోసారి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరారు. స్పీకర్ మీరాకుమార్ కుదరదని చెప్పడంతో ఇంటికి వచ్చి రాజీనామాలు ఇస్తామని అభ్యర్థించారు. అయితే తనకు ఇతర కార్యక్రమాలు ఉన్నందున కుదరదని స్పీకర్ తేల్చేశారు.

అసలు 11 గంటలకు రాజీనామాలు చేస్తామన్న ఎంపీలు సమయానికి ఎందుకు చేరుకోలేకపోయారు. చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా 11 గంటలకు ముందే.. అంటే కనీసం పదిన్నర గంటలకే అక్కడికి చేరుకోవాలి. కానీ వారలా చేయలేదు. 12 గంటలైనా పత్తా లేకుండా పోయారు.

ఇదిలావుండగా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేసినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో కేవలం ఐదుగురు మాత్రమే తమ పదవులకు రాజీనామాలు చేశారు. మరి వీరి రాజీనామాల ఎఫెక్ట్‌‍తో ఈసారైనా తెలంగాణా వస్తుందేమో చూడాలి.

వెబ్దునియా పై చదవండి