రెండ్రోజుల్లో ఢిల్లీకి కేసీఆర్... ఢిల్లీలో కేకేఆర్.. తెలంగాణ కొలిక్కి

శనివారం, 10 డిశెంబరు 2011 (14:35 IST)
FILE
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ సమస్యను తేల్చేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ తెరాస చీఫ్ కేసీఆర్‌తో తెలంగాణపై చర్చించినట్లు సమాచారం. కేసీఆర్ ముందు పలు ఆఫ్షన్లు కూడా పెట్టినట్లు భోగట్టా.

ఈ ప్రత్యామ్నాయాలతో హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ నేరుగా తన ఫామ్‌హౌస్‌కి వెళ్లి గత మూడు రోజులుగా అజ్ఞాతంలో గడిపారు. ఈ సమయంలో కీలక నేతలతో తెలంగాణ పరిష్కారంపై అక్కడి నుంచే మంతనాలు జరిపినట్లు సమాచారం. కాంగ్రెస్ కోర్ కమిటీలో కీలక సభ్యుడు అహ్మద్ పటేల్ సైతం కేసీఆర్‌తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

ఈ చర్చల అనంతరమే కాంగ్రెస్ హైకమాండ్ కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీకి రమ్మంటూ కబురు పంపినట్లు చెపుతున్నారు. ఢిల్లీకి వెళ్లిన కేకేఆర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో సుదీర్ఘంగా చర్చలు సాగించారు. ఈ చర్చలో తెలంగాణ, జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు కేసీఆర్‌తో మంత్రాంగ చేసిన పిమ్మట కాంగ్రెస్ హైకమాండ్ కేకేఆర్‌తో పాటు పీసీసి చీఫ్ బొత్సను కూడా ఢిల్లీకి రావాల్సిందిగా కబురు పంపినట్లు సమాచారం. రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి రావలసిందిగా కేసీఆర్‌కు కాంగ్రెస్ హైకమాండ్ కబురు చేసినట్లు సంబంధిత వర్గాల కథనం. మొత్తమ్మీద తెలంగాణ సమస్య పరిష్కార మార్గంపై కేసీఆర్‌ను దగ్గర కూచోబెట్టుకుని తేల్చేయాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతోంది.

వెబ్దునియా పై చదవండి