ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచంలోని అగ్రగామి దేశాలను తలదన్నే రీతిలో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్న దేశం భారతావని. అగ్రదేశాలకే సాధ్యం కాని చంద్రయాన్-1 ప్రాజెక్టును ప్రయోగించిన మొదటిసారే సక్సెస్‌ను సాధించి, ప్రపంచ దేశాల నుంచి మన్నలు పొందిన దేశం మన దేశం. శత్రువులను ఎదుర్కొనేందుకు బలమైన రక్షణ వ్యవస్థను కలిగిన భారతావని గడ్డపై పడిన అవినీతి మరకలను మాత్రం చెరపలేక పోతున్నాం.
స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు నుంచి.. ఇప్పటి వరకు అవినీతి రాజ్యమేలుతోంది. ఇది ఏ వందకో.. వెయ్యికో పరిమితమైతే ఫర్వాలేదు అనుకోవచ్చ. కానీ.. కోట్లకు కోట్లు దిగమింగేస్తున్నారు. చేసిన పనికి కొద్ది రోజులు శిక్ష అనుభవించి.. మళ్లీ పాలకులుగా పెత్తనం చెలాయిస్తున్నారు. 1948లో వెలుగు చూసిన జీపుల కొనుగోలు కుంభకోణం నుంచి.. నేటి (2008) సత్యం కంప్యూటర్స్ సంస్థ వరకు ఎన్నో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారు. నాటి నుంచి.. నేటి వరకు.. స్వతంత్ర భారతంలో చోటు చేసుకున్న కొన్ని ప్రధాన అవినీతి కుంభకోణాలు మీ కోసం....
1948లో ... లండన్‌లోని భారత హైకమిషనర్‌గా పని చేస్తున్న వీకే.కృష్ణ మీనన్ తొలిసారి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దేశ అవసరాల నిమిత్తం 2000 జీపుల కొనుగోలు ఒప్పందం కుదిరింది. ఇందుకోసం కేటాయించిన మొత్తాన్ని దిగమింగిన మీనన్.. కేవలం 150 జీపులను మాత్రమే దిగుమతి చేసిన ఘనతను మూటగట్టుకున్నారు.
1949లో .... ఈ సంఘటన మరచిపోక ముందే 1949లో ప్రస్తుత కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ తండ్రి, అప్పటి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి రావు శివ బహుదూర్ సింగ్ కేవలం 25 వేల రూపాయల లంచానికి పాల్పడి మూడు నెలల జైలు శిక్షను అనుభవించారు. ఇక్కడ గుర్తించుకోవాల్సింది.. కేవలం 25 వేల రూపాయల లంచం తీసుకోవడం.
1958లో .... ఆ తర్వాత 1958లో భారతావనిని కుదిపేసే కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జీవిత బీమా సంస్థకు చెందిన 1.25 కోట్ల దుర్వినియోగం చేసినట్టు అప్పటి ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి శ్రీకాంత్, ఆశాఖ కార్యదర్శి హెచ్.ఎం.పటేల్, ఎల్.ఐ.సి ఛైర్మన్ ఎల్.ఎస్.వైద్యనాథన్‌లతో పాటు.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీలపై ఆరోపణలు వచ్చాయి.
1959లో .... ఈ యేడాది భారత్ ఇన్సూరెన్స్ కంపెనీ ఛైర్మన్ రామకృష్ణ దాల్మియా 2.2 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. దీంతో ఆయన్ను అరెస్టు చేయగా, రెండేళ్ళ జైలు శిక్షతో తప్పించుకున్నారు.
1960లో... దేశంలో షిప్పింగ్ కంపెనీని నెలకొల్పేందుకు ప్రభుత్వం నుంచి 22 కోట్ల రూపాయల రుణాన్ని పొందిన పారిశ్రామికవేత్త ధర్మతేజ.. ఈ నిధులను స్వదేశంలో వెచ్చించకుండా విదేశాలకు తరలించాడు. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేయగా, ఆరేళ్ళ జైలు శిక్ష అనుభవించాడు. ఇదే యేడాది అప్పటి ముఖ్యమంత్రి ఒరిస్సా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ (ఇప్పటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తండ్రి) సొంత కంపెనీ కళింగా ట్యూబ్స్‌కు ప్రభుత్వ కాంట్రాక్టులు అక్రమంగా కట్టబెట్టారనే ఆరోపణలతో పదవిని కోల్పోయారు.
1970లో ... ఈ యేడాలో ప్రధాని ఇందిరాగాంధీ. ఆమె కుమారుడు సంజయ్ గాంధీలు అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. నగర్వాలా కుంభకోణం 1970లో సంచలనమే సృష్టించింది. ఈ కేసును విచారణ చేపట్టిన పోలీసు అధికారి అంతుచిక్కని రీతిలో మృతి చెందడంతో కేసు నీరుగారిపోయింది.
1974లో ... ఇందిరాగాంధీ పేరు మరో 1974లో తెరపైకి వచ్చింది. మారుతి కుంభకోణంలో ఆమె లైసెన్సులు మంజూరు చేయడంలో ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి.
1976లో ... ఈ యేడాది చమురు ధరలు గణనీయంగా తగ్గుతున్న సమయంలో 200 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును హాంకాంగ్ బేస్డ్ కంపెనీకి కట్టబెట్టారు. దీనివల్ల ప్రభుత్వానికి 13 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. ఈ నిధులు ఇందిరా, సంజయ్‌గాంధీలకు చేరినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
1980లో ... ఇటలీ పారిశ్రామికవేత్త ఒట్టావియో ఖత్రోచీ తెరపైకి వచ్చారు. ఈ యేడాడి పెట్రోలియం శాఖలో జరిగిన కుంభకోణలో ఆ శాఖ కార్యదర్శి హెచ్.ఎన్.బహుగుణ, ఎన్.ఎన్.కపాడియా, పెట్రోలియం మంత్రి పి.సిసేథి, కెపి.ఉన్నికృష్ణన్‌లపై ఆరోపణలు వచ్చాయి. ఇదే సంవత్సరం మహారాష్ట్ర సిమెంట్ కుంభకోణం వెలుగు చూసింది. అప్పటి ముఖ్యమంత్రి ఏఆర్.అంతూలే ప్రజాప్రయోజనాలను తోసిరాజని, కాంట్రాక్టులను తన సొంతవారికి కట్టబెట్టారు.
1986లో... రాజకీయ కుంభకోణం మరింత పెరిగి పోయిన సంవత్సం. జర్మనీకి చెందిన సబ్‌మెరైన్లను కొనుగోలు వ్యవహారంలో ప్రధాని ఇందిరాగాంధీ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత యేడాది ఆమె మరణించారు.
1987లో... ప్రపంచాన్నే కుదిపేసిన కుంభకోణాల్లో ఇదొకటి. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి మాయని మచ్చగా మిగిలిపోయిన భోఫోర్స్ కుంభకోణం. ఇందులో 64 కోట్ల రూపాయలు మాయం.
1991లో ... ఈయేడాది వెలుగు చూసిన జైన్ హవాలా కేసు దేశ రాజకీయ నేతల నైజాన్ని ప్రజలకు చాటి చెప్పింది. ఈ కేసులో ఎల్కే.అద్వానీ, వీసీ.శుక్లా, సీకె.జాఫర్, అరీఫ్ మొహ్మద్ ఖాన్, మదన్ లాల్ ఖురానా, కల్పనాథ్ రాయ్, ఎన్.డి.తివారీతో మరికొంతమంది రాజకీయ ప్రముఖులకు సంబంధం ఉన్నట్టు తేలింది.
అతిపెద్ద కుంభకోణం... ఇదే సంవత్సరం వెలుగుచూసిన కుంభకోణం హర్షద్ మెహతా అవినీతి. వివిధ బ్యాంకులను మోసగించి పది వేల కోట్ల రూపాయల సెక్యూరిటీ స్కాండల్. ఇది సద్దుమణగముందే.. ప్రస్తుత రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణం. 950 కోట్ల రూపాయల మేరకు స్వాహ.
1996లో ... ఇండియన్ బ్యాంకు ఛైర్మన్ ఎం.గోపాలకృష్ణ తన అధికారంతో బ్యాంకు నిధులను అడ్డుగోలుగా తన కిష్టమైన వారికి రుణాలు ఇవ్వడం. ఇలా.. 1,500 కోట్ల రూపాయల ప్రజా ధనం మటుమాయం. ఇదే యేడాది వెలుగులోకి వచ్చిన మరో కుంభకోణం. ఈకేసులో ఐటీ శాఖ మంత్రి శుఖ్ రామ్, కార్యదర్శి రేణు ఘోష్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. రేణు ఘోష్‌ను అరెస్టు చేశారు. వీటితో పాటు.. ఖైతన్ ఫరేఖ్ అవినీతి, తాజాగా సత్యం కంప్యూటర్స్ కుంభకోణాలు స్వతంత్ర భారతావనిలో చెరపలేని అవినీతి మచ్చలుగా మిగిలిపోయాయి.