సినీ నటి నుంచి సిఎం స్థాయికి కోమలవల్లి జయలలిత... అంధకారం...

శనివారం, 27 సెప్టెంబరు 2014 (17:20 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చడంతో ఆమెకు మరికొద్దిసేపట్లో శిక్ష ఖరారు కానుంది. సినీ నటిగా కెరీర్ ప్రారంభించిన జయలలిత ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అలా వాటన్నిటినీ అధిగమించి తమిళనాడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి అశేష తమిళనాడు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. జయలలిత అన్నాడిఎంకె అధ్యక్షురాలిగా, ప్రతిపక్ష నేతగా ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెట్టించారు.
 
జయలలిత గురించి కాస్త తెలుసుకుందాం... ఆమె అసలు పేరు కోమలవల్లి. అలనాటి సినీ నటి సంధ్య కుమార్తె. మైసూరులో జన్మించిన జయలలిత కుటుంబ పరిస్థితుల కారణంగా అనుకోకుండా తన 15వ సంవత్సరంలో సినీ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. జయ నటించిన తొలి తెలుగు సినిమా మనుషులు- మమతలు హిట్ కావడంతో పెద్ద తార స్థాయికి వెళ్లింది. ఆ తర్వాత మెల్లగా ఎమ్జీఆర్ పార్టీ పట్ల ఆకర్షితురాలైన ఆమె అవివాహిత గానే జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టారు.
 
జయలలిత కేసుకు సంబంధించిన వివరాలను ఒకసారి చూస్తే... 1996 జూన్ నెలలో జయలలితపై సుబ్రమణ్యం స్వామి ఫిర్యాదు చేశారు. దీనితో ఆమె ఆస్తులపై విచారణ జరపాల్సిందిగా జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో జయలలితపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఏడాదిపాటు విచారణ జరిపి 1997 జూన్లో ఛార్జిషీటు దాఖలు చేశారు. అక్టోబర్లో జయలలిత, వీకే శశికళ, సుధాకరన్, ఇళవరసిలపై అభియోగాలు నమోదు చేశారు. ఐతే 2002 మార్చిలో జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు.
 
2002 నవంబర్ నుంచి 2003 ఫిబ్రవరి వరకు సాక్షులను విచారించారు. కానీ కేసు విచారణలో పారదర్శకత లేదంటూ 2003 ఫిబ్రవరిలో అన్బుళగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదును పరిశీలించిన సుప్రీంకోర్టు 2003 నవంబర్ నెలలో ఈ కేసు విచారణను బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
 
2010లో విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలుపగా ఆ మరుసటి ఏడాది జయలలిత మళ్లీ అధికార పీఠాన్ని అధిష్టించారు. ఆస్తుల కేసుకు సంబంధించి జయలలిత 2011 అక్టోబర్, నవంబర్ నెలల్లో హాజరయ్యారు. అనేక మలుపుల తర్వాత 2014 ఆగస్టులో విచారణ పూర్తవడంతో తీర్పును వాయిదా వేయాలంటూ జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఐతే అది సాధ్యం కాదని సెప్టెంబరు 27నే తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో జయలలితకు నేడు కోర్టు విచారణ అనంతరం 4 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 10 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని లేకుండా చేస్తూ అనర్హత విధించింది. మొత్తమ్మీద తమిళనాడు ముఖ్యమంత్రి పొలిటికల్ కెరీర్ అంధకారంలో మునిగిపోయింది.

వెబ్దునియా పై చదవండి