ఈ నగరానికి ఏమైంది...? హై'జలా'బాద్.... తిలాపాపం - తలాపిడికెడు

గురువారం, 15 అక్టోబరు 2020 (09:03 IST)
ఈ నగరానికి ఏమైంది.... హైదరాబాద్ నగరం జల విలయంగా మారటానికి కారణం ఏంటి.... ఎన్నడూ లేనివిధంగా అతి భారీ వర్షం కురవడమే ఈ విపత్తుకు కారణమా? పాలకుల తప్పిదమా? ప్రజల పాపమా?.. ఏంటో ఓసారి తెలుసుకుందాం. 
 
కొండకు చిల్లు పడింది. హైదరాబాద్ మునిగిపోయింది. దాదాపు రెండు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనిరీతిలో హైదరాబాద్ కాస్తా హై'జలా'బాద్‌గా మారింది. రోడ్లు చెరువులను తలపించాయి. చెరువులు నదులు అయ్యాయి. లోతట్టు ప్రాంతాలలోని జనావాసాలు కాస్తా వరద నీటిలో తేలియాడే చిన్నసైజు నౌకలుగా కనిపించాయి. నగరవాసులకు ఎన్నడూ లేని కష్టం వచ్చి పడింది. అపార్టుమెంటు సెల్లార్‌లు కాస్త తటాకాలు‌గా మారిపోయాయి. రోడ్ల మీద నుంచి నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. రాజధాని నగరంలో రెండు వందలకు పైగా కాలనీలది ఇదే దుస్థితి. 
 
అసలు ఏం జరిగింది....  
మంగళవారం ఉదయం నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షం రాత్రి కల్లా అతి భారీ వర్షంగా మారి కొండకు చిల్లు పడినట్లుగా ఐదు గంటలపాటు దంచేసింది. ఇంతకుముందు సమీప కాలంలో ఇలాంటి జడివాన చూడలేదని అకస్మాత్తుగా పడిందని చెప్పుకుంటూపోతే సరే.... భూమి మీద పడిన వర్షపు నీరు బయటికి వెళ్లడానికి చెరువుల్లో కలవటానికి దారి ఉంటే సరే.. ఆ దారిని కాస్త మనం మూసేశాం.
Hyderabad Floods


ఎప్పుడో వచ్చే వర్షం నీరు పోవడానికి మనం దారి వదలడం ఏంటని, మనం తొక్కిన అడ్డదార్లు ఇప్పుడు మన కొంపల్నే ముంచేశాయి. అంటే మనల్ని మనమే ముంచు కుంటున్నాం. అయినా హైదరాబాద్ రోడ్లు, కాలనీలు చిన్న సైజు వర్షానికే నదులను తలపించడం మనకు కొత్తేమీ కాదు. వర్షాకాలంలో హైదరాబాద్ వాసులు నరకాన్ని చవిచూడటం, జిహెచ్ఎంసి అధికారులు ఏదో చేసేశాం అనిపించటం సర్వసాధారణమే.
 
తిలాపాపం తలా పిడికెడు....
అసలు హైదరాబాద్ నగరానికి ఇలాంటి దుస్థితి రావడానికి కారణం ఏంటి? పురాతన డ్రైనేజీ వ్యవస్థకు మోక్షం లేకపోవటమేనా? ఆనాడు నిజాం కాలం నాడు అప్పటికి సరిపడా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించారు. అప్పట్లో పట్టణంగా ఉండే హైదరాబాద్ నగరంగా మారింది. ఆ తరువాత మహా నగరంగా రూపుదిద్దుకుంది. మరో అడుగు ముందుకేసి విశ్వనగరంగా మారటానికి సిద్ధమవుతోంది. మరి గడచిన 50 సంవత్సరాలలో డ్రైనేజ్ వ్యవస్థలో, నగర ప్రణాళికలో వచ్చిన మార్పు ఏంటి... అంటే శూన్యమే కనిపిస్తోంది. కానీ జనాభా మాత్రం అత్యంత భారీగా పెరిగింది. ఇప్పటికీ ఈ దుస్థితికి అది ఒక్కటే కారణం అనుకుంటే పొరపాటే ఇందులో 50 శాతం పైగా పాపం పాలకులదైతే, మరో 50 శాతం పాపం నిస్సందేహంగా ప్రజలదే.
 
అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణ, డ్రైనేజీలు మూసి వేస్తూ రోడ్డు వెడల్పు కార్యక్రమం, ఇలా ఏదైతేనేం తిలాపాపం తలా పిడికెడు పంచుకుంటున్నారు. ఇండిపెండెంట్ గృహాలు అపార్టుమెంట్లు నిర్మాణాలలోనూ ఇంటిలో నీరు బయటకు వెళ్లాలన్న సృహ కూడా కోల్పోతున్నారు. అదీకాక లంచావతారాల పుణ్యమా అని అన్నీ అక్రమకట్టడాలే నిలువెత్తు నిదర్శనాలుగా మారుతున్నాయి. రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీని ఆక్రమించి వెలిసే కట్టడాలే ఎక్కువయ్యాయి. చెరువులన్నీ ఆక్రమణలకు గురై, చెరువును పూడ్చి బహుళ అంతస్తుల్లో నివాసాలు నిర్మిస్తున్నారు. దీనంతటికీ పార్టీల పెద్దలు, పాలకుల అండదండలు పుష్కలంగా ఉంటున్నాయి. చెరువులో ఇల్లు కట్టుకొని వర్షం వచ్చింది నా కొంప మునుగుతోంది అంటే ఎలా ఉంటుందో ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి.
 
రోడ్డెక్కిన నేతలు... జిహెచ్ఎంసి ఎన్నికల మహిమా 
భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడం ఆదరాబాదరా అధికారులు హడావుడి చేసి సహాయక చర్యలు మమ అనిపించటం అందరికీ తెలిసిందే. మరి ఈ మారు హైదరాబాద్‌కు జలవిలయం వచ్చింది. ఇప్పుడు అధికారులతోపాటు అన్ని పార్టీల నేతల హడావుడి కూడా కనిపించింది. ప్రస్తుతం నేతలు స్పందిస్తున్న తీరు కొంత భిన్నంగానూ ఉంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో సహా కార్పొరేటర్లు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ మేమున్నాం అంటున్నారు. వివిధ పార్టీల నేతలు కూడా వరద ప్రాంతాల పర్యటనలో బిజీ బిజీగా కనిపిస్తున్నారు.
 
అది చేస్తాం ఇది చేస్తాం అంటూ బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నేతల హడావుడి కి కారణం మాత్రం రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలే... నవంబర్ లేదా డిసెంబర్ నెలలో వచ్చే ఈ మహానగర ఎన్నికల కోసం అన్ని పార్టీల నేతలకు ఈ విపత్తు కలిసి వచ్చింది. దాంతో అధికార టీఆర్ఎస్ నేతలు ఎంఐఎం నాయకులను వెంటేసుకొని పాతబస్తీ చుట్టి వచ్చారు. 
 
ఏదైనా ఎన్నికలంటే నేతలకు ప్రజల సమస్యలు వెంటనే కనిపిస్తాయి. మరి ఇదే నేతలు ముందుగానే మేలుకొని అభివృద్ధి నిధులతో అంతో ఇంతో చేసి ఉంటే ఈ కర్మ నగరవాసులకు కాస్తయినా తగ్గి ఉండేదేమో. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా, నేతలు వర్షాలు పడ్డప్పుడు ఉరుకులు పరుగులు కాక, ముందస్తు ప్రణాళికలు కాస్త రూపొందించుకుంటేనే హైజలాబాద్ కాస్త హైదరాబాద్ విశ్వ నగరంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు