ప్రస్తుతానికి వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మార్పు జరుగుతుండగా, టీడీపీ, జనసేనలు తమ అభ్యర్థుల ఖరారు ప్రక్రియను వేగవంతం చేశాయి. జనసేన అభ్యర్థులను పవన్ కళ్యాణ్ దాదాపు ఖరారు చేశారు. జాబితాలో సీనియర్లకే ప్రాధాన్యం ఇచ్చారు.
అభ్యర్థుల ఎంపిక: ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఖరారుపై తుది కసరత్తు జరుగుతోంది. 2014 తర్వాత చంద్రబాబు, పవన్ ఒకే వేదికపైకి వస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 27 అసెంబ్లీ, 2 లోక్‌సభ సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది.
దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది. అనకాపల్లి, మచిలీపట్నం లోక్‌సభ స్థానాలను జనసేనకు కేటాయించడం దాదాపు ఖాయమైంది. రాజంపేట సీటుపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సీట్లపై ఒప్పందం కుదిరింది.
భీమవరంతో పాటు తిరుపతిలో పవన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. ఇప్పటివరకు ఖరారు చేసిన జాబితాలో సీనియర్లకే ప్రాధాన్యం ఇచ్చారు. నెల్లిమర్ల- లోకం నాగ మాధవి, గజపతిపురం- పడాల అరుణ, గాజువాక- సుందరపు సతీష్, భీమిలి- పంచకర్ల సందీప్ లేదా పెందుర్తి- పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచిలి- సుందరపు విజయ్ కుమార్, ముమ్మిడివరం- పీతాని బాలకృష్ణ పేర్లు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం.