గుండెపోటు ఆ రోజునే ఎందుకు వస్తుంది?

మంగళవారం, 6 జూన్ 2023 (08:36 IST)
ఇటీవలికాలంలో వయసుతో పనిలేకుండా గుండెపోటు మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. క్రికెట్ ఆడుతూనే అనేక మంది గుండెపోటుతో చనిపోయిన సంఘటనలు టీవీల్లో చూశాం. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ.. జీవనశైలిలో మార్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు ముఖ్య కారణంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ గుండెపోటులు వారంలోని మిగిలిన రోజులతో పోల్చితే ఒక్క సోమవారమే అధికంగా వస్తున్నాయి. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైనట్టు ఓ నివేదిక రిపోర్టు బహిర్గతం చేసింది. 
 
ఎస్‌టీ - సెగ్మెంట్‌ ఎలివేషన్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ అనేది ఓ రకమైన గుండెపోటు. సాధారణ భాషలో చెప్పాలంటే గుండె రక్తనాళం వంద శాతం పూడుకుపోవడం వల్ల తలెత్తే సమస్య. ఈ పరిస్థితి తలెత్తడం తీవ్ర అనారోగ్యంతోపాటు ఒక్కోసారి మరణానికి దారితీస్తుంది. అయితే, దీనిపై ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌ హెల్త్‌ అండ్‌ సోషల్‌ కేర్‌ ట్రస్ట్‌, రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. 
 
2013 నుంచి 2018 మధ్యకాలంలో ఐర్లాండ్‌ ఆస్పత్రుల్లో చేరిన 10,528 మంది రోగుల సమాచారాన్ని విశ్లేషించారు. వీటికి సంబంధించిన అధ్యయన ఫలితాలను బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన బ్రిటిష్‌ కార్డియోవాస్క్యులర్‌ సొసైటీ (BCS) సదస్సులో పరిశోధకులు వెల్లడించారు. ఆదివారం కూడా అంచనాల కంటే ఎక్కువగా స్టెమీ మరణాల రేటు ఉందని గుర్తించారు.
 
'ప్రత్యేకమైన ఈ స్టెమీ గుండెపోటు ఏ సమయంలో సంభవిస్తుందనడానికి తాజా అధ్యయనం సాక్ష్యంగా నిలిచినప్పటికి.. వారంలో ఎక్కువగా ఏ రోజు చోటుచేసుకుంటున్నాయో అనే విషయాన్ని కూడా గుర్తించాలి. ఇలా చేయడం వల్ల దీనిపై వైద్యులకు ఎంతో అవగాహన వస్తుంది. తద్వారా భవిష్యత్తులో ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు' అని బ్రిటిష్‌ హర్ట్‌ ఫౌండేషన్‌ మెడికల్‌ డైరెక్టర్‌ ఫ్రొ.నీలేష్‌ సమామి వెల్లడించారు. 
 
'వారంలో మొదటి రోజు (సోమవారం) - స్టెమీ సంభావ్యతకు మధ్య బలమైన సంబంధాన్ని కనుగొన్నాం. ఇది గతంలోనే వెల్లడైనప్పటికీ.. దీనిపై ఆసక్తి కొనసాగుతూనే ఉంది' అని అధ్యయనానికి నేతృత్వం వహించిన బీహెచ్‌ఎస్‌సీ ట్రస్ట్‌ పరిశోధకుడు జాక్‌ లాఫన్‌ పేర్కొన్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కార్కాడియం రిథమ్‌ కూడా ఓ కారణమని భావించడం సహేతుకం అన్నారు.
 
'బ్లూ మండే'గా పిలిచే ఈ పరిస్థితులు సోమవారమే ఎందుకు ఎక్కువ సంభవిస్తాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటివరకు వివరించలేకపోయారు. అయితే, గుండెపోటు కేసులు సోమవారం రోజునే ఎక్కువగా సంభవించడానికి కార్కాడియం రిథమ్‌ (శరీరం నిద్రపోవడం లేదా లేచే చక్రం)తో సంబంధం ఉందని ఇదివరకు జరిపిన అధ్యయనాలు సూచిస్తున్నాయి.
 
మరోవైపు, బ్రిటన్‌లో ఈ స్టెమీ కారణంగా ప్రతి ఏటా 30 వేల ఆస్పత్రి చేరికలు నమోదవుతున్నాయి. ఇలా పూర్తిగా మూసుకుపోయిన గుండె నాళాలను తిరిగి తెరిపించేందుకు అత్యవసర యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా లక్షణాలను గుర్తించి ఆ పూడికను కరిగించే చికిత్సను అందించగలిగితే వ్యక్తి ప్రాణాలను కాపాడొచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు