బాబుకు సొంత పార్టీలో కుంపటి... చర్య అంటున్న బాబు... వైసిపిలోకి శివప్రసాద్...?
శనివారం, 15 ఏప్రియల్ 2017 (15:11 IST)
పార్టీపై చంద్రబాబు పట్టు కోల్పోతున్నారా....? మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే అన్ని రకాలుగా ఇబ్బందులపాల్జేసిన చంద్రబాబుకు తన సొంతపార్టీ నుంచి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. చంద్రబాబు దళితులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆ పార్టీకే చెందిన ఒక దళిత ఎంపి బహిరంగంగా చెప్పాడంతో టిడిపి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అంబేద్కర్ జయంతి సంధర్భంగా 120 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ చేసి దళితులను ఆకట్టుకోవాలని ప్లాన్ చేసిన బాబుకు ఎంపి శివప్రసాద్ రూపంలో ఊహించని షాక్ తగిలింది. ఇంతకీ శివప్రసాద్ ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారు. దీనిని టిడిపి ప్రభుత్వం ఎలా కౌంటర్ చేయబోతోంది.
చిత్తూరు ఎంపి శివప్రసాద్ ఎంపిగా కంటే కూడా సినిమా యాక్టర్‌గా ఆయన చాలా ఫేమస్. రాజకీయాల్లో కూడా తనదైన రీతిలో వెరైటీలు చేస్తూనే ఉంటారు. వివిధ రకాలుగా నిరసనలు తెలిపిన ఎంపి శివప్రసాద్ ఢిల్లీ స్థాయిలో అందరికీ సుపరిచితులే. వరుసగా నాలుగుసార్లు ఎంపిగా గెలిచిన రికార్డు ఆయనకు ఉంది. కానీ ఒక దళితుడు కావడం వల్లే ఇంతకాలం తనకు సరైన పదవి రాలేదని ఆక్రోశమో లేక నిజంగానే తమ వర్గానికి అన్యాయం జరుగుతుందన్న ఆవేదనో తెలియదు కానీ అకస్మాత్తుగా ఒక పెద్ద బాంబ్ పేల్చారు.
దళితులను గంపగుత్తగా తమ పార్టీవైపు తిప్పుకోవాలన్న ఆలోచనకు చంద్రబాబు చేసిన ప్రయత్నమంతా శివప్రసాద్ వ్యాఖ్యలతో బూడిదలో పోసిన పన్నీరైంది. అంబేద్కర్ జయంతి సంధర్భంగా చిత్తూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో శివప్రసాద్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. దళితులకు చంద్రబాబు ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ గళమెత్తారు. ఉద్యోగాలిస్తామని ఆశ చూపిన చంద్రబాబు ఒక్క దళితుడికి కూడా ఉద్యోగం కాదు కదా ఉపాధిని కూడా కల్పించలేకపోయారన్నారు. ఇక ఇస్తానన్న నిరుద్యోగ భృతి మాత్రం నీటిమూటలే అయ్యిందంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా ఎస్సి, ఎస్టిల అభివృద్థి కోసం కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను కూడా చంద్రబాబు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇంత పెద్ద సమావేశం జరుగుతున్నా కనీసం కలెక్టర్ హాజరవ్వకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు టిడిపిలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. సొంత పార్టీకి చెందిన ఎంపిగా అది కూడా అంబేద్కర్ జయంతి రోజున ఇలాంటి వ్యాఖ్యలు చేయడం టిడిపికి పెద్ద డ్యామేజ్ అయ్యింది. దీనిని ఎలా కౌంటర్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. చంద్రబాబుతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న శివప్రసాద్ ఉన్నట్లుండి ఇలా ఎందుకు వ్యాఖ్యానించారో వారికి ఇప్పటికీ అర్థం కావడం లేదు.
కేంద్రంలోను, రాష్ట్రంలోను మంత్రి పదవుల విషయంలో కూడా దళితులకు అన్యాయం జరుగుతోందని శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తనను తాను ఉద్దేశించుకుని చేసినవిగా కొందరు తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. నాలుగుసార్లు ఎంపిగా గెలిచిన తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని అప్పట్లో రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఆ కల శివప్రసాద్‌కు నెరవేరలేదు. దానికి తోడు మంత్రి పదవులు ఇచ్చిన ఇద్దరు అగ్రవర్ణాలకే చెందిన వారు కావడంతో ఆయన ఆక్రోశం మరింత పెరిగినట్లుంది. ఇకనైనా బయట పడకపోతే తనకు న్యాయం జరగదని భావించారో ఏమో సంచలన వ్యాఖ్యలు చేసి పార్టీ మొత్తాన్ని ఇరకాటంలో పడేశారు.
ఎంపి శివప్రసాద్ వ్యాఖ్యల వెనుక వేరే ఆంతర్యం కూడా ఉన్నట్లు భావిస్తున్నారు కొందరు నాయకులు. ఇప్పటికే టిడిపికి జనాల్లో పట్టు పోయిందని భావించడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. దానికి తోడు వచ్చే ఎన్నికల్లో శివప్రసాద్ వైసిపి నుంచి పోటీ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసిపి తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన కిరణ్ పైన అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జగన్ ఈసారి కొత్త అభ్యర్థి ప్రయత్నాలు చేస్తున్నారు. అది తెలుసుకున్న శివప్రసాద్ తానే పోటీ చేస్తానంటూ జగన్‌తో మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. దానికి వైసిపి నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చినట్లుగా సమాచారం. అయితే ఉన్నఫలంగా పార్టీ మారుతారా... లేక ఎన్నికలు వరకు ఉండి వైసిపిలోకి వెళతారా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం అంతటి ఘాటు వ్యాఖ్యలు చేసిన శివప్రసాద్ పైన పార్టీ పరంగా చంద్రబాబు చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. కానీ యనమల రామకృష్ణుడు మాట్లాడి చూద్దామని అన్నట్లు సమాచారం.