తాగుబోతులు... తిరుగుబోతులు.. ఇదీ నిర్భయ ముద్దాయిల చరిత్ర

శుక్రవారం, 20 మార్చి 2020 (07:24 IST)
ఎట్టకేలకు రాజధాని ఢిల్లీలో జరిగి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 23 యేళ్ళ వైద్య విద్యార్థిని నిర్భయ అత్యాచార కేసులోని నలుగురు ముద్దాయిలకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్షలను అమలు చేశారు. ఈ నలుగురు ముద్దాయిలకు ఒకేసారి ఉరికంభానికి వేలాడదీశారు. అర్థగంట తర్వాత నలుగురిని వైద్యులు పరీక్షించి, చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ నలుగురు కామాంధులు చరిత్రను ఓసారి పరికిస్తే.. ఈ నలుగురు ముద్దాయిలు తాగుబోతులు, తిరుగుబోతులని స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ హేయమైన చర్యకు పాల్పడింది మొత్తం నలుగురు. వీరిలో ఒకరు మైనర్. మరో ఐదుగురు ముద్దాయిల్లో రామ్ సింగ్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆరుగురు చరిత్రను పరిశీలిస్తే, 
 
బస్సు డ్రైవర్ రామ్ సింగ్.. 
గత 2012 డిసెంబరు 16వ తేదీన బస్సును నడిపిన ప్రధాన నిందితుడు. 20 ఏళ్ల క్రితమే రాజస్థాన్‌ నుంచి బతుకు తెరువు కోసం ఢిల్లీ వచ్చి రవిదాస్‌ మురికివాడలో ఉండేవాడు. ప్రతి రోజూ మద్యం సేవించివచ్చి ఇరుగుపొరుగు వారితో తరుచూ గొడవ పడేవాడు. అయితే మరణం తప్పదని గ్రహించిన రామ్‌సింగ్‌ 2013 మార్చిలోనే జైలు గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ముఖేశ్‌ సింగ్‌
ఇతను రామ్‌ సింగ్‌కు చిన్న తమ్ముడు. బస్సు నడిపింది తానేనని, తన అన్న కాదని, పైగా తాను నిర్భయపై అత్యాచారం చేయలేదనీ అడ్డగోలుగా వాదించాడు. అయితే, మిగిలిన దోషులు అది నిజం కాదని చెప్పడంతో ఏం చేయలేకపోయాడు. 
 
అక్షయ్‌ ఠాకూర్‌
నేరం జరిగిన రోజు ఢిల్లీలో లేనని, బీహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో ఉన్న తన స్వగ్రామానికి అంతకుమందు రోజు అంటే డిసెంబరు 15నే వెళ్లిపోయానని వాదించాడు. నేరం చేసిననాటికి ఇతని వయసు 28 ఏళ్లు. పెళ్లయి ఓ కొడుకు కూడా ఉన్నాడు.  
 
పవన్‌ గుప్తా
నిర్భయను, ఆమె స్నేహితుణ్ని ఇనుపరాడ్‌తో చితగ్గొట్టి, ఆమెను ఈడ్చుకొచ్చింది ఈ దుర్మార్గుడే. ఆ ఘోరం జరిగేనాటికి 19 ఏళ్ల వాడు. తాను చేయరాని మహాపాపం చేశానని పవన్‌ అంగీకరించాడు. ఇతనిని ఎలాగైనా ఉరి నుంచి తప్పించే ఉద్దేశంతో మైనర్‌ అని నమ్మించే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ, సత్యం ముందు అవేమీ నిలబడలేకపోయాయి. 
 
వినయ్‌ శర్మ
ఇతను కూడా రవిదాస్‌ మురికివాడలో రామ్‌సింగ్‌ ఇంటి‌కి దగ్గర్లోనే ఉండేవాడు. రామ్‌సింగ్‌కు ఫ్రెండు. జిమ్‌లో శిక్షకుడిగా పనిచేసేవాడు. వయసు 25 యేళ్లు. ఆ బస్సులో తాను లేనని బుకాయించాడు. ఆ సాయంత్రం పవన్‌ గుప్తాతో కలిసి ఓ సంగీత కార్యక్రమానికి వెళ్లానని కోర్టులో వాదించాడు. నిర్భయ, ఆమె స్నేహితుడి వద్ద ఉన్న డబ్బు, బంగారం దొంగిలించి, అత్యాచారం చేసినవాడు.
 
లారీ క్లీనర్ ఆరో దోషి (మైనర్‌)
అతి కిరాతకంగా నిర్భయను అత్యాచారం చేసి, చిత్రహింసల పాల్జేసిన ఓ వ్యక్తి... మైనర్‌ అన్న నెపంతో బతికి బయటపడ్డాడు. ఇతను రామ్‌సింగ్‌ దగ్గర క్లీనర్‌గా పనిచేసిన వ్యక్తి. అత్యాచార ఘటన జరిగిన రోజు రాత్రి నిర్భయ కడుపులో పేగులను పెకలించినట్లు వార్తాకథనాలు వచ్చాయి. 'మర్‌ సా.. అని బూతులు తిట్టి ఆమెను కుళ్లబొడిచిన కిరాతకుడు. 
 
వీడికి కేసు నుంచి విముక్తి చేయడం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. బాలనేరస్థుల గరిష్ట వయోపరిమితి 18 కాదు 16 ఏళ్ల వరకే ఉండాలన్న డిమాండ్లు వచ్చాయి. ఘటన జరిగేనాటికి అతని వయసు 17 ఏళ్ల 285 రోజులు. అంటే 18 ఏళ్ల కంటే తక్కువ కావడంతో అతనిని బాలనేరస్థుల బోర్డు విచారణ జరిపింది. అతన్ని మూడేళ్ల తర్వాత రహస్యంగా విడుదల చేసి పంపేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు