ఓటుకు నోటు సాక్షుల విచారణకు షెడ్యూల్ ఖరాయింది. అప్పట్లో... మా వాళ్లు బ్రీఫ్డ్ మి అంటూ... ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వాయిస్ తో ఓటుకు నోటు కేసు సంచలనం అయింది. ఇపుడు అదే చంద్రబాబు మాజీగా మారగా, కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. దీనితో ఈ కేసుకు ప్రాముఖ్యం పెరిగింది.
కేసులో సుమారు 50 మందికి పైగా సాక్షులు ఉన్నారని, వేగంగా విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని అనిశా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ రావు కోరారు. వారంలో రెండు రోజులు మాత్రమే విచారణ జరపాలని, రోజూ విచారణ చేపట్టడం వల్ల న్యాయవాదులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు.
ఈ కేసులో ప్రజా ప్రతినిధులపై అభియోగాలు ఉన్నందున.. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు వేగంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అనిశా కోర్టు అభిప్రాయపడింది. పాక్షిక ప్రత్యక్ష విచారణల్లో ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసినట్లు అనిశా కోర్టు గుర్తు చేసింది. సాక్షుల విచారణ షెడ్యూల్ రూపొందించి న్యాయవాదులకు ఇవ్వాలని గత నెలలో ఉన్నత న్యాయస్థానం ఆదేశించిందని తెలిపింది.