ప్రత్యక్ష రాజకీయాల వైపు పవన్‌ కళ్యాణ్ అడుగులు

ఆదివారం, 28 ఆగస్టు 2016 (16:55 IST)
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. జనసేన పార్టీ అధినేతగా ప్రజల్లోకి వచ్చాడు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం రాలేదు. ప్రజా సమస్యలపై తనదైనశైలిలో స్పందించడం పవన్‌కు అలవాటు. అది ఏ పార్టీ అయినా సరే కళ్యాణ్‌ ఊరుకోరు. చెడామడా ఆ పార్టీని పార్టీ నేతలను ఏకిపారేస్తాడు. ఇదే పరిస్థితి తిరుపతిలో కూడా జరిగింది. ప్రత్యేక హోదాపై సున్నిత విమర్శలు చేస్తూ వచ్చిన పవన్‌ ఒక్కసారిగా ఫైర్‌ బ్రాండ్‌గా మారారు. తనను విమర్శించిన సినీనటి వైకాపా నేత రోజాతో పాటు మిగిలిన నేతలను కడిగేశారు. సినిమాలు చేయడం తనకు ఎప్పుడూ ఇష్టం ఉండదని, డబ్బుల కోసమే ప్రస్తుతం చేస్తున్నాను తప్ప, ప్రజా సమస్యలపైనే ఆలోచన ఉంటుందని చెప్పకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తే పవన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్న సంకేతాలు పంపించాడు. 
 
పవనిజం.. అభిమానుల్లో పవన్‌ ఒక దేవుడు. తాను ఏది చెప్పినా దానికి కట్టుబడి అభిమానులు ముందుకు నడుస్తుంటారు. లక్షలాదిమంది అభిమానులున్న పవన్‌కు సమాజ సేవ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఎప్పుడూ తన అభిమానులను సేవ చేస్తూనే ఉండమని చెబుతుంటారు. గత ఎన్నికలకు ముందు మాత్రం పవన్‌ టీడీపీ, బీజేపీలకు అండగా ఉన్నారు. తాను ప్రచారం చేయడం వల్ల పార్టీలు గెలిచాయో లేదో తెలియదని పవన్ అంటారు. ఇదంతా బాగానే ఉంది. దారుణ హత్యకు గురైన తన వీరాభిమాని కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన పవన్‌ ఉన్నట్లుండి బహిరంగసభకు ఏర్పాట్లు చేయమని జనసేన నేతలకు ఆదేశాలిచ్చాడు. ఉన్నట్లుండి పవన్‌ సభకు ఏర్పాటు చేయమన్నారేంటబ్బా అని జనసేన నేతలే ఆశ్చర్యపోయారు. అసలేం మాట్లాడుతారో పవన్‌ తెలియక తలలు పీక్కున్నారు.
 
కొంతమంది అభిమానులైతే పవన్‌ ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్న ప్రకటన చేస్తారని భావించారు. మరికొందరైతే రాష్ట్ర సమస్యలపై గళం విప్పుతారని చెప్పారు. అలా అభిమానులు అనుకున్నదే జరిగింది. అదే పవన్‌ ప్రత్యేక హోదా ప్రసంగం. తెలుగుదేశం పార్టీలో పాటు భారతీయ జనతా పార్టీని కడిగేశారు పవన్‌. తెలుగు వ్యక్తి అయిన వెంకయ్య ప్రత్యేక హోదా అవసరమా.. పెద్దాయనా నీ మాటలు వెనక్కి తీసుకో అంటూ సున్నితంగా విమర్శించాడు. అంతటితో ఆగలేదు. అరుణ్‌జైట్లీని దుమ్ము దులిపాడు. ఇదంతా ఒక ఎత్తయితే కాంగ్రెస్‌ హయాంలో కేంద్రమంత్రిగా ఉన్న జైరాం రమేష్‌ను తిట్టకుండానే తిట్టినంత పనిచేశాడు. మన రాష్ట్రం విడిపోవడానికి మొదటి సూత్రధారి జైరాం రమేష్‌ అని చెబుతూనే అందరూ చప్పట్లంతా వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు.
 
ఇక మన రాష్ట్రానికి వస్తే సిబిఐకి భయపడి చంద్రబాబు, ఎంపిలు కేంద్రానికి లాల్‌ సలామ్‌ అంటున్నారని ధ్వజమెత్తారు. ఎంపిలకు సిగ్గు, లజ్జ, అభిమానం ఏదీ లేదంటూ విమర్శించారు. అప్పటి కాంగ్రెస్‌, ఇప్పటి టిడిపి, బిజెపి ఎంపిలు ఒక్కటేనని, ఎలాంటి మార్పు వీరిలో లేదన్నారు పవన్‌. అంతేకాదు ప్రత్యేక హోదాపై మూడు దశల్లో ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నానని చెప్పుకొచ్చారు. మొదటగా రాష్ట్రం విడిపోయిన కాకినాడ నుంచే సెప్టెంబర్‌ 9వ తేదీన భారీ బహిరంగసభ. అప్పటికీ కేంద్రం దిగిరాకుంటే రెండో దశగా కేంద్రమంత్రులకు బుద్ధి వచ్చేటట్లు ఆందోళనా కార్యక్రమాలు, మూడో దశగా రోడ్లపైనే నిరసనలు ఇలా ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఆందోళనలు చేస్తానని హెచ్చరించారు.
 
ఇదంతా బాగానే ఉన్నా పవన్‌ నైజం చూస్తుంటే ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు. తన అన్న చిరంజీవి పోటీ చేసిన తిరుపతి నుంచే పోటీ చేయాలన్న ఆలోచనలో పవన్‌ లేకపోలేదంటున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనను సిద్ధం చేసుకోవాడానికే ప్రజల ముందుకు ప్రస్తుతం పవన్‌ వస్తున్నారన్న వారు లేకపోలేదు. మొత్తం మీద పవన్‌ రాజకీయాల్లోకి వస్తే ఒక కొత్త అధ్యాయం మొదలవక తప్పదు. 

వెబ్దునియా పై చదవండి