పవన్ కళ్యాణ్‌తో రాజీకి చంద్రబాబు... సన్నిహితులతో రాయబారం!

బుధవారం, 26 ఆగస్టు 2015 (09:33 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని కోసం భూసేకరణ కార్యక్రమం అధికార టీడీపీ, మిత్రపక్షం జనసేన పార్టీల మధ్య భారీ అగాథాన్నే పెంచిందని చెప్పాలి. ఇటీవల గుంటూరు జిల్లా పెనుమాకలో పర్యటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ప్రభుత్వం చేపట్టే భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. రైతులకు అండగా నిలబడ్డారు. టీడీపీ ఎంపీలు, మంత్రులపై దూకుడుగా విమర్శలు చేయడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది.
 
ముఖ్యంగా మంత్రులు రావెల కిశోర్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, పల్లె రఘునాథ్‌ రెడ్డి, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌లపై వ్యక్తిగత ఆరోపణలు సంధించారు. ఇది ఏపీ సర్కారుకు ఏమాత్రం రుచించడం లేదు. ఈ వివాదం మరింత ముదరకముందే పవన్‌ కళ్యాణ్‌ను మచ్చిక చేసుకొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులోభాగంగా భూసేకరణను తాత్కాలికంగా నిలిపి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా మిత్రపక్షమైనంత మాత్రాన బానిసగా పడి ఉండలేను అని పవన్ ఘాటుగా స్పందించడంతో ఎంపీలను, మంత్రులను ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేసే ప్రయత్నాలను చేస్తున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షం కాబట్టి విమర్శలను కూడా పాజిటివ్‌గా తీసుకుంటామని ఓ వైపు టీడీపీ నేతలు చెప్తున్నప్పటికీ.. మరో పక్క పవన్ ఎటాక్‌పై నేతలు లోలోన రగిలిపోతున్నట్లు సమాచారం. పవన్ చేసిన ఆరోపణలపై ఎంపీ మురళీమోహన్ రాజమండ్రిలో స్పందించారు. హైదరాబాద్ రింగ్‌రోడ్డు వద్ద తన సంస్థకు చెందిన భూములపై పవన్ అవగాహన లేకుండా మాట్లాడారని తప్పుపట్టారు. 
 
మరో మంత్రి రావెల కిశోర్‌బాబు కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ అభివృద్ధికి సహకరించాలని, మిత్రపక్షంగా విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. భూసేకరణపై పవన్ అమర్యాదకరంగా వ్యవహరించడం బాధించిందని మంత్రి రావెల అన్నారు. భూసేకరణపై పవన్ తీరు టీడీపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన నేపథ్యంలో జనసేన అధినేతను చంద్రబాబు మచ్చిక చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు వినికిడి.

వెబ్దునియా పై చదవండి