మధ్యతరగతి ప్రజలపై టార్గెట్ పెట్టిన ప్రధాని మోదీ... ఏం చేయబోతున్నారో తెలుసా?

సోమవారం, 9 జులై 2018 (20:57 IST)
ఇదివరకు ఆదాయపు పన్ను.. ఇన్‌కమ్ టాక్స్ కట్టేవారంతా సంపాదనపరులు, బాగా డబ్బున్నవారి కిందే లెక్క. కానీ ఆ లెక్క గత పది పదిహేనేళ్లలో మారిపోయింది. నెలకు 50 వేలు సంపాదిస్తున్నా నెల తిరిగే సరికి చేతిలో చిల్లిగవ్వ మిగలడంలేదు. పాలబిల్లు దగ్గర్నుంచి పిల్లల స్కూలు ఫీజు వరకూ మోతపుట్టిస్తోంది. ఇవి చాలదన్నట్లు వార్షిక ఆదాయం రెండున్నర లక్షలు దాటితే ఐటీ(ఇన్‌కమ్ టాక్స్) బాదుడు వుండనే వుంది. చాలీ చాలని జీతం ఒకవైపు, నెల తిరిగితే వెక్కిరించే అప్పులు ఇంకోవైపు... వెరసి బాగానే జీతం ఆర్జించే మానవుడు కాస్తా దిగువ మధ్యతరగతి కిందకు చేరిపోయాడు. 
 
ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరగాలంటే అప్పు కోసం తిప్పలు తప్పడంలేదు. ఇప్పుడీ లెక్కలన్నీ ప్రధానమంత్రి మోదీ దగ్గర వున్నాయట. ఆదాయపు పన్నుతో సతమవుతున్న మధ్యతరగతి ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఆయన గట్టి నిర్ణయమే తీసుకున్నట్లు వార్తలైతే షికారు చేస్తున్నాయి. 2014 నుంచి ప్రతి ఆగస్టు 15న ఒక్కో సంచలన నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారాయన. వచ్చే ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకోబోయే సంచలన నిర్ణయం ఇదేనంటూ నెట్లో కథనాలు హల్చల్ చేస్తున్నాయి. 
 
ఇంతకీ ఆయన తీసుకోబోయే నిర్ణయం ఏంటయా అంటే... వేతన జీవులందరికీ ఏది చేస్తే రిలాక్స్ అవుతారో అదే చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఆదాయపు పన్ను శాశ్వతంగా ఎత్తివేసేందుకు ఆయన నిర్ణయం తీసుకుంటున్నారంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి నరేంద్ర మోదీ నిజంగానే ఆ నిర్ణయం తీసుకుంటే మధ్యతరగతి ప్రజల్లో ఆయనకు ఆదరణ వుండవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు