కలియుగ వైకుంఠుడు శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన ఉన్న దివ్యక్షేత్రంలో ప్రైవేటు హోటళ్ళ ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకులు, హోటళ్ళ యాజమాన్యాలతో చేతులుకలుపుతుండటంతో తిరుమల ప్రైవేటు హోటళ్ళు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులు ఆ హోటళ్ళను ఆశ్రయిస్తే తమ జేబులకు చిల్లులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో భోజనానికి సుమారు 300 రూపాయలు వసూళ్ళు చేస్తూ భక్తులను నిలువు దోపిడీ చేసేస్తున్నారు.
తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రైవేట్ హోటళ్ళ యజమానులు. తితిదే నియమనిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి ప్రచారాలు తిరుమలలో చేయకూడదన్న నిబంధన క్షేత్రంలో ఉంది. అయితే ప్రైవేటు హోటళ్ళ యాజమాన్యాలకి ఈ నిబంధనలు వర్తించడం లేదు. అంటే వారి దందా ఏ మేరకు ఉందో కళ్లకి కట్టినట్లు కనిపిస్తోంది. తిరుమలకి వస్తున్న వాహనాలకి కొన్ని ప్రైవేటు హోళ్ళు ప్రచార పోస్టర్లను అతికించి భక్తులను మాయచేస్తూ దోపిడీ చేసేస్తున్నారు.
దీంతో భక్తులు కూడా విస్తుపోతున్నారు. దీన్ని నియంత్రించాల్సిన తితిదే ప్రేక్షకపాత్ర పోషిస్తుండటంతో హోటళ్ళ యాజమాన్యం పెట్రేగి పోతోంది. తిరుమల అంటే ధార్మికతను పవిత్రతకు పెట్టింది పేరు. అటువంటి దివ్యక్షేత్రంలో ఇలాంటి దందాలు భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తిరుమలకి వచ్చే ప్రతి భక్తుని అన్నప్రసాదాలను అందించడమే లక్ష్యంగా దేవస్థానం ముందుకి సాగుతోంది.
ఇందుకు అనుగుణంగానే తిరుమలలో వెంగమాంబ అన్నదాన ట్రస్టుని ఏర్పాటు చేసి ఉచితంగా అన్నదానం చేస్తోంది. శుచి, శుభ్రతకు పెట్టింది పేరు. ఈ అన్నదాన ట్రస్టు ఎందరో దాతలు ఈ ట్రస్టుకి విరాళాలు అందిస్తూ ట్రస్టుకి వెన్నుదన్నుగా నిలుస్తూ స్వామివారి సేవలో తరిస్తున్నారు. తిరుమలేశుడికి తమకున్న భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. ఈ అన్నదానం పేరు ప్రఖ్యాతలు దశదిశలా వ్యాపించాయి. ఈ క్రమంలో ప్రైవేటు హోటళ్ళ ఏర్పాటు శ్రీవారి పటిష్టతను దిగజారుస్తున్నాయి.
తిరుమలలో సామాన్య భక్తుడికే పెద్ద పీఠ వేస్తున్న తితిదేని ప్రైవేటు హోటళ్ళ దోపిడీ అపఖ్యాతిని తెచ్చిపెడుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. దేవస్థానం పాలకులు మేల్కొనకపోతే తితిదే ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భక్తులకు ఆరోగ్యమైన ఆహారాన్ని అందించేవరకు తితిదే యాజమాన్యం చర్యలు తీసుకుంటే తితిదే ప్రతిష్ట దిగజారే అవకాశం లేదు.