రామతీర్థం - రాజకీయం : దేవుడితో ఆట - తీసేనా తాట

సోమవారం, 4 జనవరి 2021 (09:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది. పవిత్రమైన దేవాలయాల జోలికి ఎవరు ఎందుకు వెళ్తున్నారు. ఆగకుండా జరుగుతున్న విగ్రహాలపై దాడుల వెనుక ఎవరి హస్తం ఉంది. కావాలని పోకిరీలు చేస్తున్న చర్యగా దీన్ని చూడాలా? మతోన్మాదుల చర్యగా తాట తియ్యాలా? ఏదో ఒకటి రెండు సంఘటనలు అయితే ఎవరో పోకిరీలు చేశారని అనుకోవచ్చు. వరుసగా వందకుపైగా ఘటనలు.... దీనిని ఏ విధంగా చూడాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. 
 
విజయనగరం జిల్లా రామతీర్థంలో సాక్షాత్తూ రాముడి విగ్రహానికి తల తీసేసిన ఘటన అందరికీ తలవంపులు తెచ్చేదే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి ఘటనలకు రాజకీయ రంగు పులమకుండా, నిష్పక్షపాతంగా దోషులను పట్టుకోవాలి కఠినంగా దండించాలి. మరి ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చూస్తే దేవుళ్ళ పై దాడుల విషయం దేవుడెరుగు.. మనం రాజకీయ పబ్బం గడుపుకోడానికీ భలే ఛాన్స్ దొరికిందన్న రీతిలో మన నాయకుల కుళ్ళు రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. సమిష్టిగా ఇలాంటి దురదృష్టకర ఘటనలను ఖండించాల్సింది పోయి, అధికార ప్రతిపక్ష నేతలు రాజకీయ విమర్శలు జోడించి మత విశ్వాసాలనే దెబ్బతీస్తున్నారు. 
 
చిన్న దేవాలయాలలో జరిగిన సంఘటనలు ఆయా ప్రాంతాలకే పరిమితమై ప్రజలు పట్టించుకోలేదు. ప్రముఖ క్షేత్రం అంతర్వేది రథం దగ్దం ఘటనతో రాష్ట్రం అట్టుడికింది. ఎవరో దుండగులు చేశారంటూ సిబిఐ ఎంక్వయిరీ వేశామని సరిపెట్టిన రాష్ట్ర సర్కార్, కొత్త రథం చేయించి చేతులు దులుపుకుంది. ఆ తర్వాత బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో వెండి సింహాలు మాయం ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే తాజాగా రామతీర్థం ఘటన చోటు చేసుకోవడం ప్రభుత్వానికి సవాల్ విసిరింది.
 
అయినా అటు దేవాదాయశాఖ కానీ పోలీసులు కానీ వెంటనే స్పందించి వుంటే ఈ పరిస్థితుల్లో మార్పు ఉండేదేమో, కానీ బీజేపీ, హిందూ సంఘాలు, అటు టిడిపి దీక్షా శిబిరాలు వేసుకొని దోషులను శిక్షించాలి అంటూ ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రతిపక్ష నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు రామతీర్థం పర్యటన చేయడం ఈ ఘటన రాజకీయాల చుట్టూ తిరిగేలా చేసింది. రామ తీర్థానికి చంద్రబాబు వెళ్ళిన నాడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా వెళ్ళటం ఉద్రిక్తతలకు దారితీసింది. అంతకు ముందు నుంచే బిజెపి నాయకులు కార్యకర్తలు, హిందూ సంఘాల ప్రతినిధులు రామతీర్థంలో ధర్నాలు నిర్వహిస్తూనే ఉన్నారు. 
 
మరోవైపు బీజేపీ జనసేనలు రామతీర్థం యాత్రకు పిలుపునిచ్చాయి. రామతీర్థంలో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో అనుమానితులను అరెస్టు చేశామని సాక్ష్యాధారాల కోసం చూస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇదంతా ఒక ఎత్తయితే రామతీర్థం చుట్టూ అలుముకున్న రాజకీయాలు అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. రామతీర్థం దేవాలయంలో జరిగిన ఘటన వెనుక తెలుగుదేశం నేతల పాత్ర ఉందని అధికార పక్షం వైసీపీ నేతలు మంత్రులు గొంతెత్తి మరి చెబుతున్నారు. 
 
రాష్ట్రంలో మత వాదాన్ని రెచ్చగొట్టేందుకే ఇలాంటి ఘటనలు చేస్తున్నారని అధికార పక్షం నమ్ముతుంటే... ఆధారాలతో నిరూపించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతా వారిదే. ఇటు తెలుగుదేశం నాయకులు గొంతు పెంచి మరీ అధికార పక్షంపై విమర్శలు చేశారు. రామతీర్థం ఆలయానికి వంశపారంపర్య ఛైర్మన్‌గా ఉన్న మాజీ కేంద్రమంత్రి తెలుగుదేశం నాయకుడు అశోకగజపతి రాజును ఆ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసలైన నిందితులను పెట్టుకోకుండా, రాజకీయ ప్రేరేపిత చర్యగా అశోక గజపతి రాజుపై బాధ్యత మోపారన్న విమర్శలు చోటుచేసుకున్నాయి. 
 
మరి దేవాలయాలలో దేవుడి విగ్రహాలపై దాడులు జరిగినప్పుడల్లా విమర్శలు ప్రతి విమర్శలతో పబ్బం గడపాల్సిందేనా? అసలు ఇలాంటి ఘటనల వెనుక ఎవరు ఉన్నారన్నది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందా? లేదా? ఈ ఘటనల వెనుక ఏదైనా మతపర శక్తుల ప్రమేయం ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, లేక ఉన్మాద చర్యగా తేలిస్తే వారినైనా పట్టుకొని తాట తీయాల్సిందే. ఖచ్చితంగా ప్రభుత్వంపై ఈ బాధ్యత ఉంది. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్న దరిమిలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా తగిన రీతిలో స్పందించి ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.
 
హిందూ దేవాలయాలలో జరుగుతున్న ఈ ఘటనల వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షించాల్సిన అవసరం పోలీసు వ్యవస్థ పైనా వుంది. ఏదో ఒక మతం ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఉపేక్షిస్తే రాష్ట్రంలో విద్వేషాలకు ఆజ్యం పోసిన వారవుతారు. రాజకీయ పార్టీలు ఇలాంటి ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అయితే అనవసర రాజకీయాలకు పవిత్రమైన దేవాలయాలు నిలయాలు మాత్రం కాకూడదు.

దేవాలయాల పై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వ పరంగా తగిన చర్యలు లేకపోతే, ఎటుచూసినా అధికార పార్టీకే నష్టం, ప్రతిపక్ష పార్టీలకు ఇది ఒక అస్త్రంగా మారక తప్పదు. ప్రభుత్వం మెజార్టీ మతాన్ని చులకనగా చూస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగితే అది అధికార పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం. కొందరు మంత్రులు వాదిస్తున్నట్లు ప్రధాన ప్రతిపక్షమే ప్రభుత్వాన్ని అపకీర్తి పాలు చేయడానికి ప్రయత్నిస్తుంటే అందుకు తగిన ఆధారాలను బయటపెట్టి నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. 
 
పవిత్రమైన దేవాలయాల విషయంలో జరుగుతున్న ఈ దాడుల వెనుక దోషులను పట్టుకోకుండా ఏదో బట్ట కాల్చి మీద వేశామన్న రీతిలో సాగే రాజకీయ విమర్శలను ప్రజలు సహించరు.ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగిన సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి తగిన సమాచారాన్ని పోలీసులకు అందించాలి. సున్నితమైన ఇలాంటి అంశాలలో జాగరూకత కలిగి ఉండాలి.. ఏదేమైనా గుడిని టార్గెట్గా చేసుకొని దేవతామూర్తుల విగ్రహాలపై జరుగుతున్న దాడుల కుట్రలను బయట పెట్టాల్సిందే. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించాల్సిందే.
 
రచన... 
వెలది కృష్ణ కుమార్
సీనియర్ జర్నలిస్ట్
హైదరాబాద్ 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు