ప్రపంచీకరణ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక బలీయమైన శక్తిగా ఎదగడానికి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆహ్వానించక తప్పని పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. భారతదేశాన్ని ప్రపంచ ఉత్పత్తుల కేంద్రంగా మలిచే బృహత్తర లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోడీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, నవ్యాంధ్రకు పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టేక్ ఇన్ ఇండియా అని పిలుపునిస్తూ ముందుకు సాగుతున్నారు. మోడీ, చంద్రబాబు ఆర్థిక విధానాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం నూతన ఉద్యోగ సృష్టి మరియు నైపుణ్యాలను మెరుగుపర్చడం, ఆర్థికాభివృద్ధికి అనువైన వాతావరణాన్ని సృష్టించడం.
పెట్టుబడులతో వచ్చే దేశవిదేశీ పారిశ్రామికవేత్తలకు ఇన్వెస్ట్ ఇండియా పేరిట కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రెడ్ కార్పెట్ పరచడంతో పాటు అన్ని రకాల అనుమతులను క్షణాలలో ఇప్పించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. మేక్ ఇన్ ఇండియా డివైజ్‌లకు డిమాండ్ పెరగడంతో ఆ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. భారత బ్రాండ్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 45 శాతం నమోదయ్యాయని 2015 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే ఇవి 7 శాతం పెరిగాయని తాజాగా వెల్లడైంది.
గత మూడు రోజులుగా చంద్రబాబు చైనాలో పర్యటిస్తూ, అనేక పారిశ్రామిక సంస్థలను రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టాలని కోరుతున్నారు. నవ్యాంధ్రలో 3 వేల కోట్ల పెట్టుబడితో భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు చైనాకు చెందిన యాన్ స్టీల్ గ్రూప్ ముందుకు రావడం ఒక శుభపరిణామం. దొనకొండలో రూ.43,120 కోట్లతో అంతర్జాతీయ పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు చైనా అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియా ఎంటర్ ప్రైజెస్ ఏపీ సర్కారుతోఒప్పదం చేసుకుంది.
అట్లే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద సుమారు 10,183 కోట్లతో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు మూడు కంపెనీల కన్సార్షియంతో ఏపీ సర్కారు ఒప్పదం చేసుకుంది. నవ్యాంధ్రకు చైనా నుండి పెద్ద ఎత్తున పెట్టబడులను ఆకర్షించడంలో చంద్రబాబు పర్యటన సత్ఫలితాలను ఇచ్చిందనే చెప్పవచ్చు. మోడీ - చంద్రబాబుల ద్వయం అవలంభిస్తున్న ఆర్థిక విధానాల వల్ల భవిష్యత్తులో మరిన్ని విదేశీ పెట్టుబడులు దేశానికి, రాష్ట్రానికి చేకూరతాయనే ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతుంది.