ప్రశాంత్‌ కిశోర్‌తో రజనీకాంత్‌ భేటీ.. అభిమానుల్లో కట్టలు తెంచుకున్న ఆనందం..

బుధవారం, 25 సెప్టెంబరు 2019 (10:23 IST)
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో నటుడు రజనీకాంత్‌ భేటీ అయ్యారన్న వార్త ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. తలైవా (రజనీకాంత్‌) రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానులకు 25 ఏళ్ల కల. కానీ అభిమానుల వత్తిడి మేరకో, లేక తన ఆలోచనల మేరకో ఎట్టకేలకు రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గత 2017 డిసెంబర్‌లో ప్రకటించాడు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలను రజనీ ప్రజా సంఘాలుగా పేరు మార్చారు. అభిమానులతో భేటీ అయ్యి వారికి రాజకీయపరమైన దిశా నిర్ధేశం చేశారు. 
 
అభిమాన సంఘాల్లో ముఖ్యమైన వారికి నిర్వాహకులుగా బాధ్యతలను అప్పగించారు. తమిళనాడులో కోటికి పైగా సభ్యుత్వాన్ని నమోదు చేయాలని కూడా లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధాన నగరాల్లో బూత్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికలకు వెళ్లడమే తరువాయి అన్న తరుణంలో పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చాయి. అయితే ఆ ఎన్నికలకు రజనీకాంత్‌ దూరంగా ఉండటం అభిమానుల్ని నిరాశ పరచింది. అయితే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా, రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలన్న రజనీ నిర్ణయంతో ఆయన అభిమానులు కాస్త సంతోషించారు.
 
ప్రశాంత్‌  కిశోర్‌తో భేటీ..
రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అంటున్న రజనీకాంత్‌ ఇప్పటి వరకూ పార్టీని కూడా ప్రారంబించలేదు. పార్టీ జెండా, అజెండా ఏమిటో ఎవ్వరికి తెలియదు. ఇది ఆయన అభిమానుల్లో అసహనానికి గురిచేస్తోంది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా రజనీకాంత్‌ అభిమానుల్లో ఆనందం కట్టలు తెంచుకుంటోంది. కారణం ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్‌ కిశోర్‌తో రజనీకాంత్‌ భేటీ కావడమే. 
 
2014లో పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదికి, రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ వ్యవహించారు. ఆ ఎన్నికలో భారతీయ జనతాపార్టీ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో గత శాసనసభ ఎన్నికల సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల రాజకీయ పార్టీ నాయకుల దృష్టి ప్రశాంత్‌ కిశోర్‌పై పడింది. ఇందుకు తమిళనాడు రాజకీయ పార్టీలు అతీతం కాదు.
 
కమల్‌ పార్టీకి వ్యూహకర్తగా..
తమిళనాడులో నటుడు, మక్కళ్‌ నీతి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహసన్‌ ప్రశాంత్‌కిశోర్‌ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఆయనతో సుధీర్ఘ చర్చలు జరిపి, రాజకీయపరంగా పార్టీలో పలు మార్పులు చేస్తున్నారు. పార్టీకి నాయకులు లేని నియోజక వర్గాల్లో నాయకులను నియమించడం వంటి చర్యలు తీసుకుంటూ పార్టీ బలోపేతానికి శ్రీకారం చుడుతున్నారు.
 
అదే బాటలో రజనీ..
కాగా ఇలాంటి సమయంలో అనూహ్యంగా నటుడు రజనీకాంత్‌ ఇటీవల ముంబైలో ప్రశాంత్‌ కిశోర్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రశాంత్‌కిశోర్‌ తన బృందంతో చేయించిన సర్వే వివరాలు తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు, రజనీ ప్రజా సంఘాల నిర్వాహకులు దృవీకరించారు. 
 
అంతే కాదు రజనీకాంత్‌ ప్రశాంత్‌కిశోర్‌తో భేటీ కావడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే కమల్‌హాసన్‌ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పుడు రజనీకాంత్‌ రాజకీయ పార్టీకి తన సేవలను ఎలా అందిస్తారన్న ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు