తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామికి పదవీగండం దగ్గరలోనే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏ క్షణంలోనైనా ఆయన సీఎం పీఠం నుంచి దిగిపోయే అవకాశం ఉందటున్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోపే పళణిస్వామి పనైపోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విశ్లేషకులు, చెబుతున్న విధంగా తమిళనాడులో కూడా రాజకీయాలు కూడా అదేవిధంగా జరుగుతున్నాయి. బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారిగా గందరగోళానికి దారితీశాయి. విశ్వాస పరీక్షల్లో తమకు మద్దతు ఇవ్వాలని పన్నీరు సెల్వం, దినకరన్‌లు పోటాపోటీగా కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నించి స్ట్రింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయారు. ఆ తతంగం కాస్త ఇప్పుడు తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారుతూ చివరకు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళణి స్వామి పదవికి ఎసరును తెచ్చిపెట్టింది.
పళణిస్వామి. అన్నాడిఎంకేలో సీనియర్ నేత. జయ, శశికళకు అత్యంత సన్నిహితుడు. వారు ఏం చెబితే అదే చేస్తాడు. అందుకే శశికళ జైలుకెళ్ళేటప్పుడు పళణిస్వామినే ముఖ్యమంత్రి చేసి వెళ్ళిపోయింది. అది కూడా తాత్కాలికమేనని అప్పట్లో అందరూ భావించారు. కారణం శశికళ మేనల్లుడు దినకరన్ ఆర్కే.నగర్ ఎన్నికల్లో గెలిస్తే సీఎం పదవిలో ఆయన్ను కూర్చోబెట్టి పార్టీని తన కన్నుసన్నల్లోనే నడపాలన్నది శశికళ ఆలోచన.
అందుకే అలా పావులు కదిపారు. కానీ చివరకు దినకరన్ అత్యుత్సాహం ప్రదర్శించి జైలుకు వెళ్ళారు. ఆ తర్వాత పళణి పీఠం పదిలముకున్నారు. కానీ తిరిగి దినకరన్ బయటకు వచ్చారు. ఆ తర్వాత మొదలైంది పళణికి అసలు చిక్కులు. ఇప్పుడు మొత్తం విశ్వాస పరీక్షల మీదే డీఎంకే పట్టుబట్టింది. దీంతో పళణి ఏం చేయలేని పరిస్థితి. పన్నీరుసెల్వం, దినకరన్‌లకు కావాల్సింది కూడా విశ్వాస పరీక్షలు అసెంబ్లీలో పెట్టడం. డీఎంకే కూడా దీనిపైనే ఎక్కువ దృష్టి పెడుతుండటంతో పళణికి చిక్కులు మొదలయ్యాయి.