ఈ పవన్ కళ్యాణ్‌తో వేగేదెలా? టీడీపీ నేతల అంతర్మథనం.. వదిలించుకుందామా!

శనివారం, 22 ఆగస్టు 2015 (11:05 IST)
మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌తో ఎలా సర్దుకుపోవాలన్న అంశంపై తెలుగుదేశం పార్టీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. నదీముఖ గ్రామాల్లో భూముల సేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులకు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. దీన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. 
 
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఒకరిద్దరు మంత్రులు ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నా.. వారంతా చోటామోటా నేతలే. ఒకవేళ పార్టీ సీనియర్ నేతలు ఎవరైనా స్పందిస్తూ వారికి పవన్ కళ్యాణ్ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. దీంతో వారు మరోమారు పెదవి విప్పేందుకు ఏమాత్రం సాహసం చేయడం లేదు. గతంలో ప్రత్యేక హోదాపై ఎంపీల తీరుపై కూడా పవన్ కళ్యాన్ తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో ఒకరిద్దరు ఎంపీలు గట్టి కౌంటర్ ఇచ్చినా.... పార్టీ నుంచి ఆదేశాలతో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి రావడంతో పవన్ వ్యాఖ్యలపై రసవత్తర చర్చ సాగుతోంది. 
 
ప్రస్తుతం భూసేకరణపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఎలా స్పందించాలన్న అంశంపై పార్టీ, ప్రభుత్వ పెద్దలు ముమ్మరంగా చర్చిస్తున్నారు. పవన్ దూకుడుగా ఉన్నా... నేతలు మాత్రం సమన్వయం పాటించాలని అధిష్టానం సూచించడం కూడా వారికి కొంత అడ్డంకిగా మారింది. మరోవైపు.. అమరావతికి భూసేకరణపై ఏపీ ప్రభుత్వం ముందుకే వెళుతోంది. 
 
నోటిఫికేషన్ ఇచ్చి భూ సేకరణకు నాంది పలికింది. ఓవైపు పవన్ తీవ్ర స్వరంతో వ్యాఖ్యలు చేస్తున్నా.... ఆయనకు సర్థి చెపుతామని మంత్రులు, పార్టీ నేతలు చెపుతున్నారు. పవన్ వ్యాఖ్యలు కలకలం రేపినా... ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు సేకరణకు వెళ్లాల్సి వస్తోందనే విషయం ప్రజలకు చెపితే చాలన్నారు. మంత్రులు సైతం పవన్ వ్యాఖ్యలపై ఆచి తూచి స్పందించారు. 
 
టీడీపీ కూటమి నుంచి పవన్ దూరం జరగాలనే భూసేరణను రచ్చ చేస్తున్నారని ఒకరిద్దరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీలు చేసి ఉంటే గట్టిగా బదులిచ్చే పార్టీ పెద్దలు... ఇప్పుడు అంత సీరియస్‌గా స్పందించడం లేదు. పవన్ నేరుగా గ్రామాలకు వెళతానని చెప్పడంతో ఏం జరుగనుందో ఆసక్తిగా మారింది. 

వెబ్దునియా పై చదవండి