అలా చేస్తే జనసేనకు తిరుగుండదు... మార్చి 14న జనసేన బర్త్ డే...

మంగళవారం, 14 మార్చి 2017 (13:40 IST)
జనసేన. సరిగ్గా ఆ పార్టీ పుట్టి నేటితో 3 సంవత్సరాలు. ఈ మూడేళ్ల కాలంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అడపాదడపా ప్రజల్లోకి వెళుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చారు. ఇక ట్విట్టర్లో నిత్యం టచ్ లోనే వుంటున్నారనుకోండి. ఇటీవలే గుంటూరులో జరిగిన సభలో జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. అప్పట్నుంచి జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అటు భాజపా ఇటు తెదేపా రెండూ కలిసి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చాయి. కానీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత భాజపా నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తిస్తోంది. ప్రత్యేక హోదా మాటెత్తితే సాంకేతిక కారణాలను చూపుతోంది. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు విమర్శలు చేశారు. ఆనాడు ప్రజల ముందుకు వెళ్లి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాం... ఇప్పుడు కాదంటే ప్రజలు మన నైతికతను విమర్శిస్తారనీ, అందువల్ల ఇచ్చిన హామీ నెరవేర్చి తీరాలని పట్టుబట్టాడు. 
 
పవన్ కళ్యాణ్ గోడును తెదేపా-భాజపాలు ఎంతమాత్రం పట్టించుకునే స్థితిలో లేవు. దీనితో పవన్ కళ్యాణ్ మెల్లగా తన స్వరాన్ని సవరించుకుంటున్నారు. నేరుగా తెదేపా పైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్రాన్ని తెదేపా ఎంపీలు నిలదీయాలంటూ డిమాండ్ చేశారు. ఐతే పవన్ కళ్యాణ్ డిమాండ్లను ఆ రెండు పార్టీలు పట్టించుకునే పరస్థితి కనిపించడంలేదు. 
 
మరోవైపు అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికలకు ఇక రెండేళ్లు మాత్రమే సమయం వుంది. ఈ నేపధ్యంలో జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకుకెళ్లే వ్యూహంతో పవన్ అడుగులు వేస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందించడం ద్వారా తాము విపక్ష పాత్ర పోషిస్తున్నామన్న సంకేతాలను ప్రభుత్వానికి పంపిస్తున్నారు. అలాగే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న జనసేన హోదా సాధనతో పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగితే ఇక జనసేన పార్టీకి తిరుగుండదని కార్యకర్తలు అంటున్నారు. 
 
పవన్ కళ్యాణ్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఆవిర్భావ దినోత్సవం మార్చి 14 సందర్భంగా 13 జిల్లాల్లో ప్రజల అవసరాలు, సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సన్నాహాలు చేసింది. మొత్తమ్మీద ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని పవన్ చూస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి